సన్నబియ్యం ధరలు పైపైకి.. ఎందుకో తెలుసా..?

-

రోజురోజుకు రాష్ట్రంలో సన్నరకం బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వాటి వినియోగం ఎక్కువై లభ్యత లేకపోవడంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. కేవలం నెల రోజుల్లోనే సన్నబియ్యం క్వింటాల్‌కు రూ.300 – 500 దాకా పెరిగాయి. తెలంగాణలో సన్నబియ్యం సాగు అధికంగానే చేశారు. భారీ వర్షాల కారణంగా వాటి దిగుబడి తగ్గింది. దీంతో పాటు పొరుగు రాష్ట్రాలకు భారీగా ధాన్యం తరలించడంతోనే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటి నుంచి ఆరు నెలల వరకు సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతాయని, సెప్టెంబర్‌ తర్వాతే తగ్గేందుకు ఆస్కారం ఉంటుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

 

పొరుగు రాష్ట్రాలతో దెబ్బ..

వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడంతో పాటు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సన్నరకం ధాన్యం కొనుగోళపై ఆసక్తి చూపడంతో బియ్యం ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌లలో సన్నరకం పంటల సాగు ఎక్కువగా లేకపోవడంతో వారంతా తెలంగాణ నుంచే సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. అనధికారికంగా ఇతర రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలిందని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సేకరించిన ధాన్యం కంటే ఇది లక్ష మెట్రిక్‌ టన్నులు ఎక్కువే. దీని కారణంగానే రాష్ట్రంలో సన్నాలకు కొరత ఏర్పడి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్, రవాణా చార్జీలు పెరుగుతుండటంతో కూడా బియ్యం ధరలు పెరిగేందుకు పరోక్షంగా కారణమవుతున్నాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

రైతులు అమ్ముకున్నాకే..

గత వర్షాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా 39.66 లక్షల ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. దీనికి అనుగుణంగా 50 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర సన్నరకం ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినా లెక్క తప్పింది. ఆగస్టు నుంచి మూడు నెలలగా భారీగా కురిసిన వర్షాల కారణంగా సన్నరకం పంట భారీగా దెబ్బతిని ఎకరాకు 25 – 30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కేవలం 10 –15 వచ్చింది. ధాన్యం తడవడం. తాలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు కేంద్రాల్లో సేకరణ సరిగ్గా జరగకపోవడంతో రైతులు మద్దతు ధరకన్నా తక్కువకు రూ.1,500 కే అమ్మేసుకున్నారు.

మద్దతు ధర రాకపోవడంతో కొన్ని చోట్ల రైతులే ధాన్యాన్ని మిల్లులకు వేసి క్వింటాల్‌ బియ్యాన్ని రకాన్ని బట్టి రూ.3,000–4,000 వరకు అమ్ముకున్నారు. డిసెంబర్‌ వరకూ మేలురకాలైన బీపీటీకీ బహిరంగ మార్కెట్‌లో రూ.3,150 ఉండగా, రైతులు ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత ప్రస్తుతం రూ.3,500కు చేరింది. హెచ్‌ఎంటీ బియ్యానికి రూ.3,300 నుంచి రూ.3,700, జైశ్రీరామ్‌ రూ.3,850 నుంచి రూ.4,100, తెలంగాణ సోనా రూ.3,450 నుంచి రూ.3,800 వరకు ధర పెరిగింది. పాత బియ్యం జైశ్రీరామ్, 1008 రకాలైతే ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో క్వింటాలుకు ఏకంగా రూ.5,000–5,200 దాకా ధర పలుకుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version