సకాలంలో పన్ను చెల్లిస్తే ఈ లాభాలు పొందొచ్చు..!

ప్రతీ ఏడాది చాలా మంది పన్ను చెల్లింపుదారులు సమయానికి ట్యాక్స్ రైటర్స్ ని ఫైల్ చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయకుండా చివరి నిమిషం వరకూ వాయిదా వేస్తుంటారు. కానీ టైం కి కట్టేయడమే మంచిది. ముందస్తుగా లేదా సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందొచ్చు. ఇక ఆ లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

incometax

 

టైం కి ఐటీఆర్ ని దాఖలు చెయ్యక పోతే పన్నుపై వడ్డీ చెల్లించాలి. 234A, 234B సెక్షన్ల లోని నిబంధనల ప్రకారం మీరు ఐటీఆర్ ని సకాలంలో దాఖలు చేస్తే, చెల్లించాల్సిన పన్నుపై వర్తించే వడ్డీని ఆదా చెయ్యచ్చు. లేట్ గా దాఖలు చేస్తే ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారం పన్ను చెల్లింపుదారులు ముందస్తుగా పన్ను చెల్లించకపోయినా.. లేదా చెల్లించాల్సిన పన్నులో 90% కంటే తక్కువ చెల్లించినా.. సెక్షన్ 234B కింద నెలకు 1% లేదా కొంత భాగానికి వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేదాకా కట్టాలి.

అలానే గడువు తేదీకి ముందు ఐటీఆర్ దాఖలు చేయని పక్షంలో ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపవచ్చు. దీని వలన మీరు ఇబ్బంది పడాలి. కనుక సకాలంలో పూర్తి చేస్తే మంచిది. అదే విధంగా ఆలస్యమైన ఐటీఆర్ ని దాఖలు చేయడానికి అదనంగా రుసుము కట్టాలి. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారు ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల ప్రకారం రూ. 10 వేల వరకు జరిమానా పే చెయ్యాలి.

అందుకే ముందుగా కట్టడమే బెస్ట్. అలానే గడువు తేదీకి ముందు ఐటీఆర్ ని దాఖలు చేయడం ద్వారా మీ నష్టాలను తదుపరి సంవత్సరాలకు కూడా పొడిగించవచ్చు. భవిష్యత్తులో మీ ఆదాయంపై పన్ను భారం తగ్గుతుంది. అదే విధంగా రుణాలు వెంటనే పొందొచ్చు. ఎందుకంటే మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు.. బ్యాంకులు ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ ప్రూఫ్ గా మీ ఐటీఆర్ స్టేట్‌మెంట్ కాపీని అందించాలని కోరుతాయి. కనుక సకాలంలో ఈ పనిని పూర్తి చేస్తేనే మంచిది.