కొత్త సంవత్సరంలో తేదీ వేసేప్పుడు జ‌ర జాగ్ర‌త్త.. ఎందుకంటే..?

కొత్త సంవ‌త్స‌రం రాబోతుంది. 2019కి గుడ్ బై చెప్పి 2020కు వెల్ క‌మ్ చెప్ప‌బోతున్నాం. ఈ నెల 31న ఎంతో ఆనందంగా ఈ 2020 సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. కానీ ఈ సంవత్సరం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు కొని తెచ్చుకోనున్నారు. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. కొత్త సంవత్సరంలో చెక్కు మీద, ఇతర లీగల్‌ డాక్యుమెంట్ల మీద తేదీ వేసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే.. సంవత్సరం రాసేచోట ‘డిడి/ఎంఎం/వైవై’ పద్ధతిలో రెండు అంకెలు వేసే అలవాటు ఉన్న వారికి ప్రమాదం. వారిచ్చే చెక్కులను, ఇతర డాక్యుమెంట్లను తీసుకున్న వారు వాటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు 14వ తేదీ జనవరి 2020 సంవత్సరం అని రాయడానికి 14/01/20 అని రాశారంటే కోరి కొరివి తెచ్చుకున్నట్లే.

దాన్ని ఎవరైనా ట్యాంపర్‌ చేసి 2000 నుంచి 2099 వరకు ఏ అంకెనైనా చివర్లో వేసుకొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ డాక్యుమెంటునే మీకు వ్యతిరేకంగా వినియోగించుకొనే ప్రమాదం ఉంది. అందుకే, 2020 సంవత్సరంలో ఏడాదంతా తేదీ వేసేటప్పుడు ‘డిడి/ఎంఎం/వైవైవైవై’ ఫార్మట్‌నే పాటించాలి. సోమరితనానికి పోకుండా సంవత్సరం మొత్తం 2020 అని రాయాలి. అలా చేయకపోతే ఫ్రాడ్‌కు చేజేతులా అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతాం. 2021 సంవత్సరం వచ్చాక మళ్లీ వందేళ్లపాటు ఏళ్లపాటు మీ ఇష్టం!