పైసా పెట్టుబడి లేకుండా చేసేదే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌.. ఎలాగంటే..?

-

వ్య‌వ‌సాయం కోసం ఒక్క పైసా కూడా ఖ‌ర్చు చేయ‌కుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ద‌తిలో చేసే వ్య‌వ‌సాయాన్నే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్ అంటారు. అంటే ఇందులో విత్త‌నాల నుంచి పంట‌కు చ‌ల్లే ఎరువుల వ‌ర‌కు పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం సాగుతుంది.

మ‌న దేశంలో ప్ర‌స్తుతం చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాలు వాండి పంట‌ల‌ను పండిస్తున్నారు. అవి ఉప‌యోగించకుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను సాగు చేసే వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అయితే నిజానికి కృత్రిమ ఎరువుల‌ను వాడ‌డం క‌న్నా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను పండిస్తేనే దిగుబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దీనికి తోడు పంట‌ల‌ను పండించే భూమి ఎన్నేళ్ల‌యినా సారం కోల్పోకుండా ఉంటుంది. అలాగే సేంద్రీయ పంట‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి కూడా న‌ష్టం వాటిల్ల‌కుండా ఉంటుంది. కానీ.. సేంద్రీయ ప‌ద్ధ‌తిపై రైతుల‌కు ఎక్కువ‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది కృత్రిమ ఎరువుల‌ను వాడే పంట‌ల‌ను పండిస్తున్నారు.

అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఓ ప‌దం వాడారు. అదే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌. అంటే.. ఎలాంటి పెట్టుబ‌డి లేకుండా వ్య‌వ‌సాయం చేయ‌డ‌మ‌న్న‌మాట‌. అయితే అది నిజంగా సాధ్య‌మ‌వుతుందా..? రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌కుండా పంట‌ల‌ను పండించ‌డం సాధ్య‌మేనా..? అంటే సాధ్య‌మేన‌ని ఆ వ్య‌వ‌సాయ‌వేత్త చెబుతున్నారు. ఆయ‌నే సుభాష్ పాలేక‌ర్‌. జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయాన్ని మొద‌ట‌గా క‌ర్ణాట‌క‌లో ఒక ఉద్య‌మంగా ఆయ‌న ప్రారంభించ‌గా.. ఇప్పుడ‌ది అక్క‌డ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. అయితే అస‌లు సేంద్రీయ వ్య‌వ‌సాయానికి, జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయానికి తేడా ఏమిటి..? అంటే..

వ్య‌వ‌సాయం కోసం ఒక్క పైసా కూడా ఖ‌ర్చు చేయ‌కుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ద‌తిలో చేసే వ్య‌వ‌సాయాన్నే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్ అంటారు. అంటే ఇందులో విత్త‌నాల నుంచి పంట‌కు చ‌ల్లే ఎరువుల వ‌ర‌కు పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం సాగుతుంది. మార్కెట్‌లో దొరికే విత్త‌నాలను సాధార‌ణంగా కృత్రిమ ఎరువుల‌ను వాడి ప్రాసెస్ చేస్తారు. అందువ‌ల్ల ఆ విత్త‌నాల‌ను ఈ ప‌ద్ధ‌తిలో వాడ‌కూడ‌దు. రైతులు త‌మ‌కు స‌హ‌జంగా దొరికే విత్త‌నాల‌నే ఈ వ్య‌వ‌సాయంలో వాడాలి. అంటే సేంద్రీయ ప‌ద్ధ‌తిలో సాగు చేయ‌బ‌డిన పంట‌ల నుంచి సేక‌రించబ‌డిన విత్త‌నాల‌ను రైతులు పంట కోసం ఉప‌యోగించాలి. దీని వ‌ల్ల వారు ఒక పంట నుంచి తీసిన విత్త‌నాల‌ను మ‌రొక పంట‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో విత్త‌నాల‌ను కొనే బాధ త‌ప్పుతుంది. ఇక్క‌డ డ‌బ్బు ఆదా అవుతుంది.

ఇక జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌లో రెండో ద‌శ‌.. సేంద్రీయ ఎరువుల‌ను వాడ‌డం. రైతులు త‌మ‌కు అందుబాటులో ఉండే స‌హ‌జ‌సిద్ధ ప‌దార్థాలైన ఆవు మూత్రం, పేడ త‌దితరాల‌తో త‌యారు చేయ‌బ‌డే ఎరువుల‌ను వాడాలి. దీంతో ఎరువుల‌ను కొనే ఇబ్బంది త‌ప్పుతుంది. ఫ‌లితంగా అస‌లు ఎలాంటి పెట్టుబ‌డి లేకుండానే వ్య‌వ‌సాయం చేయ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులైన‌ జీవామృతం, బీజామృతం త‌యారీ త‌రువాత ఈ వ్య‌వ‌సాయంలో ఆచ్ఛాద‌న‌, వాప‌స ప్ర్ర‌క్రియ‌లు ముఖ్య‌మైన‌వి.

జీవామృతం త‌యారీ ఇలా…

కావలసిన పదార్థాలు (ఒక ఎకరం పంట పొలానికి సరిపడేందుకు):

డ్రమ్ము – నీళ్ళు పట్టేది 1
నీళ్ళు – 200 లీటర్లు (సుమారుగా 15 బిందెలు)
ఆవు పేడ – 10 కిలోలు
ఆవు మూత్రం – 10 లీటర్లు
పప్పు దినుసుల పిండి – 2 కిలోలు
బెల్లం – 2 కిలోలు
గట్టు మట్టి – గుప్పెడు

తయారు చేసే విధానం:

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను డ్ర‌మ్ములో వేసి బాగా క‌ల‌పాలి. దాన్ని 4 రోజుల పాటు అలాగే ఉంచాలి. రోజూ దాన్ని 3 సార్లు (ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం) క‌ల‌పాలి. 4 రోజుల త‌రువాత జీవామృతం త‌యార‌వుతుంది. దాన్ని పంట‌కు వాడ‌వ‌చ్చు. ఈ జీవామృతాన్ని 3 నెల‌ల్లో పూర్త‌య్యే పంట‌ల‌కు 4 ద‌శ‌ల్లో వాడాల్సి ఉంటుంది. మొద‌టి ద‌శ‌లో విత్త‌నం నాటిన నెల‌కు 5 లీట‌ర్ల జీవామృతం, 100 లీట‌ర్ల నీరు క‌లిపి పిచికారి చేసుకోవాలి. రెండోసారి మొద‌టి పిచికారి అయ్యాక 21 రోజుల త‌రువాత 10 లీట‌ర్ల జీవామృతం, 150 లీట‌ర్ల నీరు క‌లిపి పిచికారి చేయాలి. రెండోసారి పిచికారి చేసిన మ‌ళ్లీ 21 రోజుల త‌రువాత మూడో సారి 20 లీట‌ర్ల జీవామృతం, 200 లీట‌ర్ల నీటితో క‌లిపి పిచికారి చేసుకోవాలి. ఇక నాలుగోసారి గింజ ఏర్ప‌డేట‌ప్పుడు 5 లీట‌ర్ల మ‌జ్జిగ‌, 200 లీట‌ర్ల నీటితో క‌లిపి పిచికారి చేయాలి. చివ‌రిసారి జీవామృతంతో ప‌నిలేదు.

బీజామృతం త‌యారీ…

సేంద్రీయ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాక ఎంపిక చేసుకున్న స‌హ‌జ‌సిద్ధ‌మైన విత్త‌నాల‌ను శుద్ధి చేసుకోవాలి. దీనికోసం బీజామృతాన్ని వాడుతారు. బీజామృతంతో విత్త‌న శుద్ధి చేస్తే చీడ‌పీడ‌ల బెడ‌ద త‌ప్పుతుంది. అలాగే దిగుబ‌డి ఎక్కువ‌గా వ‌స్తుంది. అందుకు గాను ఒక తొట్టిలో 20 లీట‌ర్ల వ‌ర‌కు నీటిసి పోసి అందులో ఆవు పేడ‌ను ప‌లుచ‌ని వ‌స్త్రంలో మూట క‌ట్టి 12 గంట‌ల సేపు నీటిలో ఉంచాలి. ఒక లీట‌ర్ నీటిని వేరే పాత్ర‌లో తీసుకుని అందులో 50 గ్రాముల సున్నం క‌లిపి రాత్రంతా ఉంచాలి. రెండో రోజు ఉద‌యాన్నే నాన‌బెట్టిన పేడ మూట‌ను చేత్తో పిండి సారాన్ని తొట్టి నీటిలో క‌ల‌పాలి. పేడ నీళ్లున్న తొట్టిలో పొలం గ‌ట్టున తీసిన మ‌ట్టిని క‌లిపి క‌ర్ర‌తో బాగా క‌లియ‌బెట్టాలి. 5 లీట‌ర్ల ఆవు మూత్రాన్ని, సున్న‌పు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి బాగా క‌లియ‌బెట్టుకోవాలి. దీంతో బీజామృతం సిద్ధ‌మ‌వుతుంది. ఆ త‌రువాత ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌పై విత్త‌నాల‌ను పోసి అందులో బీజామృతం త‌గినంత క‌లుపుకోవాలి. బీజామృతం విత్త‌నాల‌కు బాగా ప‌ట్టిన త‌రువాత విత్త‌నాల‌ను కొంత సేపు నీడ‌న ఆర‌బెట్టాలి. ఆ త‌రువాత వాటిని విత్తుకోవ‌చ్చు. అలాగే నారును, మొక్క‌ల‌ను కూడా బీజామృతంలో ముంచి నాటుకోవ‌చ్చు.

ఆచ్ఛాద‌న‌…

దీన్ని మూడు ర‌కాలుగా చేయాల్సి ఉంటుంది. ఈ విధానం వ‌ల్ల పొలంలో మ‌ట్టి మ‌రింత సార‌వంతంగా మారుతుంది. అలాగే మ‌ట్టిలో మ‌రింత ప్రాణ‌వాయువు, తేమ చేరుతాయి. దీంతో పంట‌ల దిగుబ‌డి పెరుగుతుంది. అయితే ఆచ్ఛాద‌న‌లో ఒక ర‌కంలోనైతే నేల‌ను మరీ లోతుగా దున్న‌రాదు. ఇక రెండో ర‌కంలో .. అంత‌కు ముందు పండిన పంట‌ల‌కు చెందిన వ్య‌ర్థాలు, జంతు మ‌ల‌, మూత్ర వ్య‌ర్థాల‌ను అలాగే నేల‌లో ఉండ‌నివ్వాలి. దీంతో పంటలు మ‌రింత ఏపుగా పెరుగుతాయి. ఇక మూడో ర‌కంలో అంత‌ర్ పంట‌ల‌ను సాగు చేయాల్సి ఉంటుంది. అంటే.. పొలంలో ఒకే పంట కాక‌, ఒకేసారి రెండు లేదా మూడు పంట‌ల‌ను సాగు చేయ‌డం అన్న‌మాట‌. దీంతో ఒక పంట సాగు మ‌రొక పంట‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

వాప‌స‌…

ఏ పంట వేసినా పంట‌ల‌కు త‌గినంత నీరు ఉన్న‌ప్పుడే అవి ఏపుగా పెరిగి దిగుబ‌డి బాగా వ‌స్తుంది. అందుక‌ని రైతులు పంట‌ల‌కు త‌గినంత నీరు ల‌భించేలా చూసుకోవాలి. అయితే పంట‌ల‌కు ఎక్కువ‌గా మ‌ధ్యాహ్నం స‌మ‌యంలోనే నీటిని అందించాల‌ని వ్య‌వ‌సాయ వేత్త సుభాష్ పాలేక‌ర్ అభిప్రాయం. ఎందుకంటే మొక్క‌ల వేళ్లు మ‌ట్టిలో ఆవిర‌య్యే నీటిని ఎక్కువ‌గా గ్ర‌హిస్తాయ‌ట‌. ఈ ప్ర‌క్రియ సహ‌జంగానే మ‌ధ్యాహ్నం పూట ఎక్కువ వేగంగా జ‌రుగుతుంది క‌నుక‌.. ఆ స‌మ‌యంలో పంట‌కు నీరందిస్తే చాలా ఉప‌యోగం ఉంటుంద‌ని పాలేక‌ర్ చెబుతున్నారు.

ఇక పైన చెప్పిన విధానంలో వ్య‌వ‌సాయం చేస్తూ పంట‌ల సాగుకు ఎలాంటి పెట్టుబ‌డి పెట్టకుండా (దాదాపుగా చాలా త‌క్కువ‌గా పెట్టుబ‌డి పెడితే) దిగుబడి సాధిస్తే దాన్ని జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్ అంటారు. ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త దేశంలో క‌ర్ణాట‌క‌తోపాటు, ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో ఈ త‌ర‌హా వ్య‌వ‌సాయం జోరందుకుంది. ఈ క్ర‌మంలోనే జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయంపై రైతులు దృష్టి సారిస్తే ఓ వైపు పెట్టుబ‌డిని త‌గ్గించుకోవ‌డంతోపాటు మ‌రోవైపు అధిక దిగుబ‌డి సాధించి లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version