కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపుగా 47 రోజుల నుంచీ సెలూన్లు, ఇతర బార్బర్ షాపులు ఓపెన్ కాలేదు. కానీ కేంద్రం లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో ఆయా షాపుల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే దేశంలో అనేక చోట్ల ఇంకా ఈ షాపులు ఓపెన్ కాలేదు కానీ.. హర్యానాలో మాత్రం వీటిని సోమవారం నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రారంభించారు.
ఇక సెలూన్ షాపుల్లో కేంద్రం సూచించిన నిబంధనల మేర నడుచుకోవాలి. తక్కువ మంది కస్టమర్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. ఇక బార్బర్లు పీపీఈ కిట్లను ధరించి పనిచేయాలి. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో సెలూన్లు ఎల్లప్పుడూ తక్కువ సంఖ్యలో కస్టమర్లను మాత్రమే షాపులోకి అనుమతించాలి. షాపు వద్ద కస్టమర్లు గుమిగూడకుండా చూడాలి.
సెలూన్ షాపుల్లో, షాపుల చుట్టూ పరిసరాల్లో కచ్చితంగా శానిటైజేషన్ చేయాలి. కస్టమర్ల కోసం వాడే ప్రతి వస్తువును శానిటైజ్ చేయాలి. ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా షాపును శుభ్రంగా ఉంచాలి. అలా ఉంచితేనే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇక ఈ నిబంధనలను షాపుల వారు తూచా తప్పకుండా పాటించాలి.