కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ ఈ నెల 17వ తేదీ తరువాతే రైళ్లను నడిపిస్తామని మొదట చెప్పింది. అయితే అనూహ్యంగా రేపటి నుంచే (మే 12) ప్రయాణికుల రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే సదరు రైళ్లు న్యూఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు తిరగనున్నాయి. మొత్తం 30 రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. ఢిల్లీ నుంచి 15 గమ్యస్థానాలకు ఆ రైళ్లు నడుస్తాయి.
రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తున్న ఈ రైళ్లను న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ముతావి తదితర స్టేషన్లకు నడిపిస్తారు. ఇక ఈ రైళ్లలో ప్రయాణించేందుకు గాను ప్రయాణికులు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి టిక్కెట్లను IRCTC వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక అందుబాటులో ఉండే రైలు బోగీలు, పరిస్థితులను బట్టి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైళ్లను నడపనున్నారు.
కాగా రైళ్లో ప్రయాణించే వారు కింద తెలిపిన పలు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవేమిటంటే..
* సదరు ప్రత్యేక రైళ్లకు గాను కేవలం IRCTC లోనే టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. ఇతర ఎక్కడా టిక్కెట్ల బుకింగ్‌కు ప్రస్తుతం అనుమతి లేదు. అంటే.. కేవలం ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
* రైల్వే స్టేషన్లలోని టిక్కెట్ బుకింగ్ కేంద్రాల్లోనూ ఈ రైళ్లకు టిక్కెట్లను విక్రయించరు. అలాగే రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్లను కూడా విక్రయించరు.
* కేవలం టిక్కెట్ బుక్ చేసుకున్నవారు.. అది కూడా కన్‌ఫాం టిక్కెట్ ఉన్నవారు మాత్రమే 1 గంట ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి.
* రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు నిర్వహిస్తారు. వాటిల్లో నెగెటివ్ వస్తేనే.. రైలులో ప్రయాణించేందుకు అనుమతినిస్తారు.
* రైలు టిక్కెట్లపై ప్రయాణికులు పాటించాల్సిన నియమ, నిబంధనలు ఉంటాయి. వాటిని తెలుసుకుని ప్రయాణికులు రైళ్లలో సురక్షితంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
* ప్రతి ప్రయాణికుడు తన ఫోన్‌లో కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే యాప్‌ను ఆన్‌లో ఉంచి.. లొకేషన్, బ్లూటూత్‌లను కూడా కచ్చితంగా ఆన్ చేయాలి.
* రైళ్లలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంటుంది. ఆ నిబంధనను ప్రయాణికులు పాటించాలి.
* రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కచ్చితంగా మాస్కులను ధరించాలి. హ్యాండ్ శానిటైజర్లతో చేతులను శానిటైజ్ చేసుకోవాలి.