చిత్ర పరిశ్రమకు జగన్ గుర్తొచ్చారండో!

-

చిత్రపరిశ్రమ హైదరాబాద్ లోనే ఉండటమే కారణమో లేక మరేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తప్ప ఆంధ్ర ప్రభుత్వం గుర్తుకువచ్చిన దాఖలాలు జగన్ సీఎం అయ్యాక దాదాపు లేవనే చెప్పాలి! జగన్ సీఎం అయ్యాక అభినందనలు తెలపడం దగ్గరనుంచి… పరిశ్రమకు అనుకూలమైన జీవోలు ఇచ్చేవరకూ.. ఏ సందర్భంలోనూ జగన్ ను వారు గుర్తుచేసుకున్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పుకోవాలి! ఆ సంగతులు అలా ఉంటే… తెలుగు చిత్రపరిశ్రమ తాజాగా జగన్ కు ఒక లేఖ రాసింది!

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

దీనికి గతాన్ని జతచేసిన నిర్మాతల మండలి… చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ కు తరలివచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి, ల్యాబ్స్ కట్టుకోవడానికి స్ధలాలు ఉదారంగా కేటాయించారని.. అలాగే నిర్మాతలు, ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్ధలాలు ఇచ్చారని తెలిపారు. ఆ రకంగానే నేడు ఆంధ్రప్రదేశ్‌ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన స్ధలాలను ముఖ్యమంత్రి కేటాయించాలని వారు ఈ లేఖలో కోరారు.

జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ఈ సందర్భంగా నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలియచేసింది!

Read more RELATED
Recommended to you

Latest news