భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అటు రైతులకు, ఇటు ప్రజలకు చల్లని కబురు చెప్పింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు వర్షాల కబురు అందించింది. జూన్ 1న రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏడాది అదే తేదీన రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని.. ఈసారి కూడా టైముకు రుతు పవనాలు వస్తుండడం శుభ పరిణామమని ఐఎండీ తెలిపింది.
కాగా అంఫన్ తుపాను వల్ల గత 10 రోజులుగా రుతు పవనాల కదలిక తగ్గిందని, అయినప్పటికీ ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడనున్న తక్కువ పీడనం కారణంగా రుతుపవనాలు టైముకు వస్తాయని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం రుతు పవనాలు.. మాల్దీవులు, కొమొరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులపై నెమ్మదిగా కదులుతున్నాయని.. మరో 3 రోజుల్లో అవి కేరళ తీరాన్ని తాకి.. ఆ తరువాత వారం పది రోజుల్లో దేశమంతటా విస్తరిస్తాయని తెలిపారు.
ఇక ఈ సారి రుతు పవనాలు టైముకు వస్తే వర్షాలు బాగానే పడే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు.