క్యారీమినాటి ఉదంతం అనంతరం టిక్‌టాక్ రేటింగ్ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో 4.7గా ఉన్న రేటింగ్ 1.2 కు చేరుకుంది. అయితే గూగుల్.. ప్లేస్టోర్‌లో ఆ రేటింగ్స్‌ను తొలగించింది. దీంతో టిక్‌టాక్ ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ భారత్‌లో మాత్రం టిక్‌టాక్‌కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మరో యాప్ టిక్‌టాక్‌కు గట్టి పోటీనిస్తోంది.
బెంగళూరుకు చెందిన ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి శివాంక్ అగర్వాల్ మిత్రోన్ (Mitron) పేరిట అచ్చం టిక్‌టాక్‌ను పోలిన ఓ యాప్‌ను ఏప్రిల్ లో లాంచ్ చేశాడు. ఇది అచ్చం టిక్‌టాక్‌లాగే పనిచేస్తుంది. ఇందులోనూ టిక్‌టాక్ తరహాలో యూజర్లు వీడియోలను క్రియేట్ చేసి పోస్ట్ చేయవచ్చు. అలాగే యాప్‌లో ఇతర యూజర్లు పోస్ట్ చేసే వీడియోలను చూడవచ్చు. ఆ వీడియోలు చాలా తక్కువ నిడివి కలిగి ఉంటాయి. అయితే ఈ యాప్ కేవలం గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది.
ఇక మిత్రోన్ యాప్ ఏప్రిల్‌లో లాంచ్ చేసినా కేవలం 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 50 లక్షల డౌన్‌లోడ్లు పూర్తి చేసుకుంది. దీనికి 2.30 లక్షల మంది యూజర్లు 4.7 రేటింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ యాప్ ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడుతున్న టాప్ 10 పాపులర్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ఇదే విషయం టిక్‌టాక్‌ను కలవరపెడుతోంది. మిత్రోన్ యాప్‌కు ఆదరణ పెరుగుతుండడం టిక్‌టాక్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్యారీమినాటి సంఘటన వల్ల బ్యాన్ టిక్‌టాక్ అనే ఉద్యమం ప్రారంభమవడంతోనే టిక్‌టాక్‌ను చాలా మంది తీసేసి.. అందుకు బదులుగా మిత్రోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని, పైగా ఇది భారతీయ కావడం కూడా భారీ సంఖ్యలో డౌన్‌లోడ్‌లకు కారణమవుతుందని.. డెవలపర్లు అంటున్నారు. మరి ముందు ముందు మిత్రోన్ యాప్ టిక్‌టాక్‌కు ఏ విధమైన పోటీ ఇస్తుందో చూడాలి.