పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదు కదా అనుకుంటుంది. దొంగచాటుగా ఇండ్లలోకి ప్రవేశించి అలా పాలు తాగుతుంది. కానీ దాని బాగోతం ఏదో ఒక రోజు బయట పడక తప్పదు కదా. సరిగ్గా అక్కడ ఇలాగే జరిగింది. ఓ ఉపాధ్యాయురాలు ప్రభుత్వానికి చెందిన పాఠశాలలో ఓ వైపు పూర్తి స్థాయి టీచర్‌గా పనిచేస్తూనే మరోవైపు 25 స్కూళ్లలోనూ విధులు నిర్వర్తిస్తున్నట్లు రికార్డులు సృష్టించింది. అంతే కాదు.. అలా ఆమె మోసం చేస్తూ కొన్ని నెలలుగా నెలకు రూ.లక్షల్లో ఆ స్కూళ్లన్నింటి నుంచి జీతం తీసుకుంటోంది. మొత్తం ఆమె ఇప్పటి వరకు రూ.1 కోటికి పైగానే జీతం తీసుకుంది. అయితే మోసం ఎన్నటికీ దాగదు కదా.. ఏదో ఒక రోజు బయట పడాల్సిందే. అందులో భాగంగానే ఆమె చేసిన చీటింగ్‌ను అధికారులు ఇట్టే పట్టేశారు.
యూపీకి చెందిన అనామికా శుక్లా అనే ఉపాధ్యాయురాలు అక్కడి ఓ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో ఫుల్ టైం సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. నెలకు రూ.30వేల వరకు జీతం కూడా తీసుకుంటోంది. అయితే అంబేద్కర్ నగర్, బాఘ్‌పట్, అలీగఢ్, సహరాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్ తదితర ఇతర ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీలలోనూ టీచర్‌గా పనిచేస్తున్నట్లు ఆమె రికార్డులు సృష్టించింది. అంతేకాదు.. 13 నెలలుగా ఆ స్కూళ్లలో పనిచేస్తున్నట్లు రిజిస్టర్‌లలో అవకతవకలకు పాల్పడి ఆయా స్కూళ్ల నుంచి జీతం కూడా తీసుకుంటోంది. అలా మొత్తం 25 స్కూళ్ల నుంచి ఆమె అక్రమంగా నెల నెలా జీతం తీసుకున్నట్లు వెల్లడైంది. నెలకు ఒక స్కూల్ నుంచి రూ.30వేల చొప్పున, 25 స్కూళ్లకు రూ.7.50 లక్షలను జీతంగా తీసుకుంది. 13 నెలలుగా ఆమె అలా తీసుకున్న జీతం మొత్తం రూ.1 కోటికి పైగానే అయిందని అధికారులు గుర్తించారు.
తాజాగా యూపీలో కేజీబీవీ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన డిజిటల్ డేటాబేస్‌ను అధికారులు రూపొందించారు. దీంతో అనామికా శుక్లా అనే పేరు మీద ఓ టీచర్ 25 స్కూళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ టీచర్ వ్యక్తిగత సమాచారం అంతా ఒకేలా ఉండడం వారు చూశారు. దీంతో ఆ టీచర్ ఒక్కరేనని అధికారులు నిర్దారించారు. ఒకే టీచర్ 25 స్కూళ్లలో 13 నెలలకు పైగా పనిచేస్తున్నట్లు, ఆయా స్కూళ్ల నుంచి పెద్ద మొత్తంలో నెల నెలా జీతం కూడా తీసుకుంటున్నట్లు నిర్దారించారు. దీంతో ఆమెపై అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈమె చేసిన మోసం ఫిబ్రవరి నెలలోనే బయట పడింది. కాకపోతే లాక్‌డౌన్ వల్ల విచారణ జరగలేదు. కానీ ప్రస్తుతం ఆమెపై విచారణ జరుగుతుందని త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అయితే ఆమె అన్ని స్కూళ్లలో పనిచేస్తున్నట్లు అసలు రికార్డులు ఎలా సృష్టించిందని, అది కూడా ఆన్‌లైన్‌లో అటెండెన్స్ పడేలా ఎలా చేసిందని.. పోలీసులు విస్తుపోతున్నారు. ఆమె ఒక్కతే ఈ పని చేయడం అసాధ్యమని, ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించి ఉంటారనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి కిలాడీలు ఉన్నంత కాలం మన దేశంలో విద్యావ్యవస్థ అస్సలు బాగుపడదు. అది నిజమే కదా..!