ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టిన కరోనాను తిట్టుకోని వారు ఉండరు.. ఈ వైరస్ వల్ల ఏమి నష్టపోయామో అంచనా వేయటం చాలా కష్టం. అది అర్థిక నష్టం కావచ్చు, మానసిక వేదన కావచ్చు, సామాన్యుడు, వలస కూలీల రోదన కావచ్చు, రైతుల అవేదన కావచ్చు, కుటీర, చిన్న, మథ్య తరహా, భారీ పరిశ్రమల కార్మికుల వేదన కావచ్చు, ఇలా ఎవరివో కన్నీటి ధారలు కావచ్చూ.. అయితే దీనిని లెక్క కట్టటం, నేటి నేతలకు ఇష్టం లేదు. కారణం, సదరు విలువ బయటకు వస్తే, వారి విలువలు, వలువలు పోతాయి కనుక.
ఇకపోతే ఒక్కటి మాత్రం నిజం.. అదేమంటే కరోనా వలన మాత్రం ప్రకృతికి మంచి జరిగింది. నదులు శుభ్ర పడినాయి, కాలుష్య కారకాలు కలవక. థృవ ప్రాంతాలలో ఏర్పడిన ఓజోన్ పోరకు ఉన్న చిల్లు కేవలం పదుల రోజులలో పూడుకు పోయింది. గాలిలో విషవాయువులు, దుమ్ము థూళి కలవక పోవటం వలన, స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతున్నాము. పంచ భూతాలలో నింగి, నేల, నీరు, వాయువు అనేవి కరోనా పుణ్యమా అంటూ పూర్వ వైభవం సంతరించు కున్నాయి. ఇక నిప్పుని ఏది కలుషితం చేయదు కాబట్టి, దాని గురించి చెప్పనక్కర్లేదు. ఇలా పంచ భూతాలలో, చతుష్ట భూతాలు బాగుపడ్డాయి. అంతెందుకు ఋషికేష్ లో ఉన్న గంగానదిని చూడండి, ఏంత స్వచ్ఛంగా ఉన్నదో. అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నిప్పులాంటి నిజాలు మాట్లాడుకుంటే.. గంగా నది కలుషితమై, దాని నీరు త్రాగటానికి, స్నానానికి పనికి రాకుండా పోవటానికీ, నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు కాదా ? అవి కరోనా లాక్ డౌన్ వలన మూత బడటంతో, ఇన్నాళ్ళు వేల కోట్లు రుపాయలు వీటి శుద్ధి మీద పెట్టినది వృథా ఖర్చు అని తెలియటం లేదా ?..
అదే సోమ్ములు ప్రభుత్వం ఇటువంటి కాలుష్యకారక పరిశ్రమల తరలింపు పైన పెడితే, సహజ వనరు అయిన నదీ నదాల నీరు స్వచ్చంగా ఉండేవి కాదా?.. ఎన్నో అనారోగ్యాలు ప్రజలకు వచ్చేవి కాదు కదా?. నేడు తాగే నీటిని డబ్బులు పెట్టి కోనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా? అంటే, మనిషి మూర్ఖత్వం, పారిశ్రామిక వేత్తలు స్వార్థం, రాజకీయ చిత్తశుద్ధి లేమి, నదుల కాలుష్యకారకం కాదంటారా?.. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ఇది ముమ్మాటికి స్వార్ధపరులు సృష్టిస్తున్న సంక్షోభమే.. మనుషులు మారనంత వరకు మానవజాతి ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనక తప్పదు..