కరోనా లాక్‌డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లిన కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 20 నుంచి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ పేరిట ఓ కొత్త పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గ్రామాలకు తిరిగి వచ్చిన కార్మికులతోపాటు అక్కడ ఉండే నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది.
కాగా జూన్ 20వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. బీహార్‌లోని ఖగారియా జిల్లా బెల్దౌర్ బ్లాక్, తెలిహర్ గ్రామంలో ఈ పథకం ప్రారంభమవుతుంది. బీహార్ సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి మోదీ ఈ పథకాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తారు. ఇందులో పలువురు కేంద్ర మంత్రులతోపాటు 6 రాష్ట్రాలకు చెందిన సీఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు.
బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని సుమారుగా 25వేల మందికి పైగా కార్మికలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 116 జిల్లాల్లో ఈ పథకం కింద 125 రోజుల పాటు కార్మికులకు పని కల్పిస్తారు. మొత్తం 25 రకాల ఉపాధి హామీ పనులను ఇందులో చేర్చారు. దీనికి గాను కేంద్రం సుమారుగా రూ.50వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉండే గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా ఈ పథకం అమలవుతుంది. భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ, కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధి హామీ పనులు జరిగేలా చూస్తారు.
గ్రామీణాభివృద్ది శాఖ, పంచాయతీ రాజ్, రోడ్లు, రవాణా శాఖ, జాతీయ రహదారులు, గనులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం, సహజవాయువు, పునరుత్పాదక శక్తి, సరిహద్దు రహదారులు, టెలికాం, వ్యవసాయం తదితర మంత్రిత్వ శాఖలు సమన్వయంతో ఈ పథకం కింద ఉపాధి హామీ పనులను చేపడుతాయి.