నా వ్యాప్తినే ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుందో లేక.. మాస్కులు తయారూచేసే ఫ్యాక్టరీలో పనిచేసినంతమాత్రాన్న తన ప్రభావం ఆగదని, ఆ మాస్కును ధరించినప్పుడు మాత్రమే ఆగుతుందని చెప్పే ప్రయత్నం చేసిందో తెలియదు కానీ.. తనను నిర్లక్ష్యం చేస్తే తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అటాక్ చేస్తానని చెబుతుంది కరోనా! తన వ్యాప్తిని ఆపుతున్న వైద్యులను సైతం వదలనని ఇప్పటికే పలుమార్లు నిరూపించిన కరోనా.. తాజాగా మాస్కులు తయారు చేసేవారికి సోకింది. దీంతో… ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో సరదా సెటైర్లు పడుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే… కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్ లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలా అని ఇదే మొదటిసారి కాదు… ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందట. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. వైరస్ సోకిన కార్మికులు ఫ్యాక్టరీకి ఏయే గ్రామాల నుంచి వస్తున్నారు.. వచ్చే మార్గ మధ్యలో ఎవరెవరిని కలుస్తున్నారు.. వారి వారి ఇళ్లల్లో ఎంత మంది ఉన్నారు.. ఇలా మళ్లీ మొదటికి వచ్చి, లెక్కలు తీస్తూ టెస్టులు చేస్తున్నారంట అధికారులు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేయడం.. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్లాంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే 70 మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేయడం.. దీనికి కారణమైన సదరు ప్లాంట్‌ను వెంటనే సీల్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం.. దీన్ని నడుపుతున్న ప్రైవేటు కంపెనీపైనా క్రిమినల్ కేసు నమోదు చేయడం హుటాహుటిన జరిగిపోయాయి.