భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు.
తాజాగా, భారత్‌లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17,296 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని, అలాగే మరో 407 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కు చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్‌తో 15,301 మంది మరణించారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,89,463 ఉండగా, 2,85,636 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.