తమిళనాడులో ఇటీవల చోటు చేసుకున్న తండ్రీ కొడుకుల మృతి ఘటన ఆ రాష్ట్రంలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆ ఇద్దరి మృతికి కారణమైన పోలీసులను వారి ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అయితే దీనిపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తామని తెలిపారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అక్కడి సత్తంకుళం ప్రాంతంలో ఇటీవల పోలీసుల కస్టడీలో మృతి చెందిన తండ్రీ కొడుకులు జయరాజ్, బెనిక్స్‌ల కేసును సీబీఐకి అప్పగిస్తామని తెలిపారు. అయితే ఈ కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కోర్టు అనుమతితో కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టులో మదురై బెంచ్ ఎదుట ఈ కేసు వాదనకు వచ్చినప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని.. కోర్టుకు తెలపనున్నామని.. పళనిస్వామి పేర్కొన్నారు.
ఇక ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మిక్కిలి బాధాకరమని సీఎం పళనిస్వామి అన్నారు. ప్రజల పట్ల.. అందులోనూ కస్టడీలో ఉన్న వారి పట్ల మరింత హుందగా ప్రవర్తించాలని పోలీసులకు తాము ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకానీ.. హింసకు పాల్పడకూడదని ఆయన పోలీసులకు సూచించారు.