రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన గుంటూరులో మొత్తం మూడు ఎంపీ స్థానాలున్నాయి. వీటిలో ఒకటి టీడీపీ దక్కించుకుంది. మిగిలిన రెండు వైసీపీ యువ ఎంపీలు దక్కించుకున్నారు. అయితే, టీడీపీ ఎంపీ విషయాన్ని పక్కన పెడితే.. వైసీపీకి ఉన్న ఇద్దరుఎంపీల విషయాన్ని తీసుకుంటే.. వీరిలో ఎవరు దూకుడుగా ఉన్నారు.. ఎవరు విజన్‌తో ఉన్నారు.. అనే విషయం చర్చకు వస్తోంది. ఇప్పటికి వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఏడాది పూర్తయింది. నిజానికి ఇద్దరినీ తీసుకుంటే.. భిన్నమైన కోణాలు మనకు కనిపిస్తాయి. నరసారావు పేట నుంచి విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయులు.
ఈయన ఉన్నత విద్యచదవడమే కాదు.. మంచి క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన చాలా సౌమ్యుడు.. వివాద రహితుడు. ఇక, బాపట్ల నుంచి విజయం సాధించిన ఎస్సీ వర్గానికి చెందిన నందిగం సురేశ్.. లైఫ్‌స్టయిల్ భిన్నం. ఈయనను ఒక రకంగా పక్కా లోకల్.. పక్కామాస్ అని చెప్పుకోవ చ్చు .. వైసీపీ కోసం జెండా పట్టుకుని రోడ్డు పై కూర్చొని ధర్నా చేసినా.. పోలీసులతో కొన్ని సందర్భాల్లో దెబ్బలు తిన్నా ఆయన నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నం నభూతో అని చెప్పాల్సిందే.
రాజధాని ప్రాంతంలో అరటి తోటలను తగలబెట్టిన కేసులో ఈయన పేరు గతంలో మార్మోగింది. ఇలా భిన్నమైన దృక్ఫథాలు వీరిలో మనకు కనిపిస్తాయి. ఇక, వీరిద్దరూ ఎంపీగా గెలిచి.. ఏడాది కాలం పూర్తయింది. ఈ క్రమంలో వీరి పరిస్థితి ఏంటి? నియోజకవర్గం లో వీరి దూకుడు ఎలా ఉంది? అనే విషయాలు చర్చకు వచ్చినప్పుడు నందిగం సురేష్ నియోజకవర్గం లోనే ఉంటున్నారు. అయితే, ఆశించిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. కేవలం ప్రభుత్వాన్ని పొగడడం, ప్రతిపక్షాన్ని ఆక్షేపించడంతోనే ఆయన సరిపెట్టుకుంటున్నారని అంటున్నారు.
ఇక, లావు విషయానికి వస్తే.. ఆయనపై వివాదాలు లేవుకానీ.. స్థానికంగా పార్టీ నేతలతో అంతగా కలివిడిగా ముందుకు సాగలేక పోతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మొత్తంగా ఈ ఇద్దరు ఎంపీలు ఇంకా కష్టించాల్సి ఉందని, కేవలం సౌమ్యంగా ఉన్నా.. లేదా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా కాచుకున్నా.. ప్రయోజనం ఉండదని అంటున్నారు.