గతంలో ఉమ్మడిరాష్ట్రంలో లాగా రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమో, మరే ఒక్క పట్టణమో మాత్రమే అభివృద్ధి చెందితే.. భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు తలెత్తడంతోపాటు.. ప్రాంతాల మధ్య తారతమ్యాలు పెరగకుండా ఉండాలని భావిస్తూ.. పరిపాలన వికేంద్రీకరణ దిశగా ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఫలితంగా తెరపైకి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. దీనిపై తాజాగా బీజేపీ నుంచి క్లారిటీ వచ్చినట్లయ్యింది!
అమరావతిలో రాజధానిని ఉంచుతూనే… మిగిలిన రెండు రాజధానులుగా విశాఖను, కర్నూలును ప్రభుత్వం ప్రతిపాదించింది! ఇటు ఆంధ్ర, అటు ఉత్తరాంధ్ర, మరోపక్క రాయలసీమ… ఇలా అన్ని ప్రాంతాలను పరిపాలనలోనూ, అభివృద్ధి లోనూ భాగస్వాములను చేసే పనికి పూనుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వస్తున్న విమర్శల సంగతి తెలిసిందే. అదే కారణమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ… గడిచిన ఐదేళ్లలో ఒక్క శాస్వత భవనం కూడా లేని అమరావతి లోనే మొత్తం రాజధాని ఉండాలని, ఆ ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందాలన్నట్లుగా టీడీపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేయడం మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో ఏపీ బీజేపీ – జనసేన – కమ్యునిస్టుల సహకారంతో కాస్త హడావిడి చేసే ప్రయత్నమే చేశారు.. తమ అనుకూల మీడియాలో ఊదరగొట్టించారు గుంటూరు – కృష్ణాజిల్లలకూ చెందిన మెజారిటీ టీడీపీ నేతలు! అయితే.. ఈ విషయంపై బీజేపీ నేత సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు. “ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనేదే బీజేపీ డిమాండ్ అని.. రైతుల పక్షాన బీజేపీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని.. బీజేపీ-జనసేన శ్రేణులు రైతులకు అండగా ఉంటాయని” చెప్పుకొచ్చారు. అంతవరకూ చంద్రబాబు & కో లకు హ్యాపీ అనిపించొచ్చు కానీ… అనంతరం చెప్పిన మాటవల్ల అటు 13జిల్లాల జనాలు హ్యాపీ, ఏపీ సీఎం జగన్ కూడా ఫుల్ హ్యాపీ అంటున్నారు విశ్లేషకులు!
“రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు న్యాయం చేయాలి.. ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు.. భవిష్యత్ లో కూడా కేంద్రం జోక్యం చేసుకోదు” అని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు! ఈ విషయాంలో సునీల్ దేవధర్ మాటలను కాస్త నిశితంగా పరిశీలిస్తే… “అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తూ.. రాజధానిని ఎక్కడకావాలో అక్కడ నిర్మించుకోవచ్చు.. అలా కాకుండా రైతులకు అన్యాయం చేస్తే మాత్రం బీజేపీ – జనసేనలు పోరాడతాయి” అని చెప్పినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అంటే… అమరావతి రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపుకుని, వారికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని క్లారిటీ ఇస్తే… ఆల్ మోస్ట్ ఢిల్లీ బీజేపీ నుంచి పూర్తి మద్దతు వచ్చేసినట్లే!!