కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జనాలందరూ ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం పలు కషాయాలు, హెర్బల్ టీలు తాగుతూ, విటమిన్ ఉన్న ఆహారాలను తింటూ కరోనా రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసమే కాదు.. కరోనా వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారికి కూడా ఆ వ్యాధి త్వరగా తగ్గేందుకు.. వారి శరీర రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సైంటిస్టులు కొత్తగా ఓ హెర్బల్ టీని తయారు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చౌదరి శర్వాన్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కృషి విశ్వవిద్యాలయకు చెందిన సైంటిస్టులు కొత్తగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని తయారు చేశారు. కోవిడ్ 19 వైరస్‌పై పోరాడేందుకు గాను పలు యాంటీ ఆక్సిడెంట్లను కలిపి ఈ టీని తయారు చేసినట్లు వారు తెలిపారు. ఇందులో అన్నీ సహజ సిద్ధమైన పదార్థాలనే వాడామని, పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన టీ ఆకులను, ఇతర పదార్థాలను ఇందులో ఉపయోగించామని వారు తెలిపారు. అందువల్ల ఇవి కెమికల్స్ ఫ్రీ అని వారు తెలిపారు.
ఇక ఆ యూనివర్సిటీ వారు తయారు చేసిన టీ మొత్తం 4 రుచుల్లో లభిస్తోంది. ఆర్గానిక్ గ్రీన్ టీ విత్ తులసి, గ్రీన్ టీ విత్ లెమన్ హనీ, ఆర్థోడాక్స్ టీ విత్ మింట్, తులసి అండ్ రోజ్, ఆర్థోడాక్స్ బ్లాక్ టీ విత్ రోజ్ రుచుల్లో టీ బ్యాగ్‌లను వారు ఆవిష్కరించారు. అయితే ప్రస్తుతం వీటిలో కేవలం కొన్ని ఫ్లేవర్లలో ఉన్న టీలను అక్కడి క్యాంపస్‌లోనే విక్రయిస్తున్నారు. వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశాక ఆన్‌లైన్‌లోనూ విక్రయించనున్నారు. వినియోగదారులు ఏ టీ ఫ్లేవర్‌కు చెందిన బ్యాగులను ఎంచుకున్నా 25 టీ బ్యాగులకు రూ.225 అవుతుంది. ఈ టీలలో epigallocatechin, epigallocatechin gallate అనబడే రెండు పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. అందువల్ల కోవిడ్ రాని వారే కాదు.. వచ్చిన వారు కూడా తమ శరీర రోగ నిరోధకశక్తిని ఈ టీలు తాగి పెంచుకోవచ్చని తెలిపారు.