ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై వికాస్‌దూబే విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపై అతను బుల్లెట్ల వర్షం కురిపించాడు. దీంతో ఆ దాడిలో ఓ డీఎస్‌పీ సహా మొత్తం 8 మంది పోలీసులు చనిపోయారు. ఈ క్రమంలో ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఎట్టకేలకు వికాస్ దూబేను పోలీసులు పట్టుకున్నారు. కానీ అసలు వికాస్ దూబే ఎవరు ? అతని వార్తలు ఎందుకింత సంచలనం సృష్టిస్తున్నాయి ? అతను ఏం చేశాడు ? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…
* వికాస్‌దూబే ఓ పేరు మోసిన రౌడీ షీటర్. యూపీలోని బిక్రు అతని సొంత గ్రామం. అది శివ్‌లి పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది. అయినా అక్కడి చౌబేపూర్ పోలీస్ స్టేషన్ అతని అక్రమాలకు అడ్డాగా మారింది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే వికాస్ దూబేపై ఏకంగా 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినా ఇప్పటికీ అక్కడ అతను టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో లేడు. కారణం.. చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బంది వికాస్ దూబేకు తొత్తులుగా ఉండడమే. అందువల్లే దాదాపుగా 3 దశాబ్దాల నుంచి వికాస్ దూబే నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
* జూలై 2వ తేదీ అర్ధరాత్రి బిక్రు గ్రామంలో ఉంటున్న వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు ఓ పోలీసు టీం అక్కడికి వెళ్లింది. అక్కడికి కాన్పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓ హత్య కేసుపై విచారణ చేసేందుకు గాను పోలీసులు వికాస్ దూబే ఇంటిపై దాడికి వెళ్లారు. ఆ కేసులో వికాస్ దూబే నిందితుడిగా ఉన్నాడు.
* గతంలో వికాస్ దూబేను పలుమార్లు అరెస్టు చేశారు. అయినా అతను చేసిన 60 నేరాలకు చెందిన క్రిమినల్ కేసులకు అతనికి ఇంకా శిక్ష పడలేదు. దీంతో అతను కాన్పూర్ పోలీసులకు సవాల్ విసురుతూ దిన దిన ప్రవర్థమానం అన్నట్లు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అక్కడి నేతలు, బిగ్‌షాట్స్‌తో అతను సత్సంబంధాలను కలిగి ఉండేవాడు. అందుకనే అతని ఆటలు కొనసాగాయి.
* 2000వ సంవత్సరంలో వికాస్ దూబే జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ అతను రాంబాబు యాదవ్ అనే వ్యక్తిని చంపేందుకు ప్లాన్ వేసి దాన్ని జైలు నుంచే విజయవంతంగా అమలు చేశాడు. అదే ఏడాది మరో వ్యక్తిని చంపిన కేసులోనూ వికాస్ నిందితుడిగా ఉన్నాడు.
* ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు సంతోష్ శుక్లాను హత్య చేసింది కూడా వికాస్ దూబేనే. ఓ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 25 మంది సాక్షులు కూడా అతన చంపుతుండడాన్ని చూశారు. ఇది వికాస్ దూబే చేసిన కీలక నేరాల్లో ఒకటి.
* సంతోష్ శుక్లా హత్య కేసులో వికాస్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు పోలీసు అధికారులే భయపడ్డారు. దీంతో 2005లో సరైన సాక్ష్యాలు లేని కారణంగా వికాస్ ఆ కేసు నుంచి తప్పించుకున్నాడు.
* సంతోష్ శుక్లా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ముందు కూడా వికాస్ మరో హత్య చేశాడు. కాన్పూర్‌లో కేబుల్స్ బిజినెస్ చేసే దినేష్ దూబే అనే వ్యాపారవేత్తను అతను హత్య చేశాడు.
* వికాస్ దూబే 1990లలో చిన్నపాటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు చేసే వాడని అక్కడి స్థానికులు చెబుతారు. తరువాత సొంతంగా తన గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని కాన్పూర్ డాన్‌గా మారాడు. అయితే తన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు, వాటి నుంచి తప్పించుకునేందుకు అతను 1995-96లలో బీఎస్‌పీలో చేరి రాజకీయాల్లో ఉన్నాడు.
* వికాస్ దూబే ఎమ్మెల్యే కావాలని అనుకునేవాడు. జిల్లా పంచాయతీ స్థాయిలో పలు పదవుల్లో పనిచేశాడు. అతని భార్య కూడా జిల్లా పంచాయతీ కమిటీలో సభ్యురాలిగా ఉండేది. వికాస్ సొంత గ్రామం బిక్రులో గత 15 ఏళ్ల నుంచి పంచాయతీ ఎలక్షన్లు లేవు. వికాస్‌కు నచ్చిన వారినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అందుకు ఎవరూ అభ్యంతరం కూడా చెప్పరు.
* పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే తన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బందితో అతను సత్సంబంధాలను నెలకొల్పుకున్నాడు. కొందరు పోలీసులు నిజానికి వికాస్ అత్యంత చనువుగా ఉండేవారు. అతనికి కొందరు పోలీసులు స్నేహితులుగా కూడా ఉన్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి తనకు రక్షణగా ఉండడం కోసమే కొందరు పోలీసులతో అతను సఖ్యంగా ఉండేవాడు. వారికి వికాస్ నెల నెలా నజరానాలు కూడా ఇచ్చేవాడట. ఇక తాజాగా జరిపిన కాల్పుల ఘటనలో పోలీసులు దాడికి వస్తున్నట్లు ముందుగానే వికాస్‌కు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొందరు సమాచారం అందించారు. దీంతో వికాస్ తన ఇంటి వద్ద తన గ్యాంగ్‌ను మోహరించాడు. పోలీసులు అక్కడికి చేరుకోగానే వికాస్, అతని ముఠా సభ్యులు పోలీసులపై భారీ ఆయుధాలతో విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ కాల్పుల్లో మొత్తం 8 మంది పోలీసులు చనిపోగా.. ఘటన అనంతరం వికాస్ అక్కడి నుంచి పారిపోయాడు. చివరకు అతన్ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.