కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టింది. అక్కడి వూహాన్ నగరంలో ఒక్కసారిగా వైరస్ బయట పడింది. జనవరి 23వ తేదీన పెద్ద ఎత్తున కరోనా కేసులు అక్కడ బయట పడ్డాయి. దీంతో ఆ నగరంలోని 11 మిలియన్ల మందిని చైనా లాక్‌డౌన్‌లోకి నెట్టేసింది. తరువాత కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇది జగమెరిగిన సత్యం. అయినా చైనా తాము ఆ వైరస్‌ను సృష్టించలేదనే ఇప్పటికీ వాదిస్తోంది. అయితే ఇదే విషయంపై ఎట్టకేలకు కళ్లు తెరిచిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) చైనాలో వచ్చే వారం పర్యటించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకుంది. వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం పర్యటించి నిజానిజాలను తెలుసుకునేందుకు సిద్ధమైంది. అయితే ఆ నగరంలో ఇప్పుడు కృత్రిమ వరదలు వస్తున్నాయి. ఇది ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది.
వూహాన్‌లో వర్షాలు బాగానే పడుతున్నాయి. మరో 31 రోజుల వరకు వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీన్ని అదునుగా చేసుకుని వూహాన్‌కు సుమారుగా 370 కిలోమీటర్ల దూరంలో యిలింగ్ జిల్లాలో ఉన్న త్రీ గార్జెస్ అనే డ్యామ్ నుంచి భారీ ఎత్తున నీటిని వదులుతున్నారు. ఆ నీరంతా వూహాన్‌కు చేరుకుని కృత్రిమ వరదలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో జనాలను కొన్ని రోజుల పాటు బయటకు రాకూడదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే వూహాన్‌లో కరోనా పుట్టుకకు సంబంధించిన సాక్ష్యాలను పూర్తిగా మాయం చేసేందుకే అక్కడ ఇలా కృత్రిమ వరదలను సృష్టించారని పలువురు ఆరోపిస్తున్నారు. వచ్చే వారంలో డబ్ల్యూహెచ్‌వో బృందం అక్కడ పర్యటించాల్సి ఉందని, వారికి నిజాలు తెలుస్తాయనే నెపంతోనే చైనా కావాలనే ఇలా కృత్రిమ వరదలను సృష్టించి కరోనా సాక్ష్యాలను పూర్తిగా మాయం చేసే యత్నం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.
అయితే వూహాన్ అధికారుల వివరణ మాత్రం మరోలా ఉంది. డ్యామ్‌లో వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉందని.. నీటిని కిందకు వదలకపోతే డ్యామ్ పూర్తిగా నాశనమై పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని.. అందుకనే గేట్లను వదిలి వరదనీటికి కిందకు పంపుతున్నామని తెలిపారు. అయినా.. కరోనా సాక్ష్యాలను చైనా అసలు ఎప్పుడో మాయం చేసిందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే దర్యాప్తు విషయంలో చాలా ఆలస్యం చేసిందని.. చైనా ఇంకా సాక్ష్యాలను తమ వద్ద ఉంచుకునే యత్నం చేయదని.. అవి ఎప్పుడో మాయమై ఉంటాయని.. కొత్తగా వాటిని మాయం చేసే వీలు లేదని.. పలువురు అంటున్నారు.