గత కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా ఓడిపోయింది గుర్తుంది కదా. కేవలం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే భారత్ గెలిచింది. రెండు మ్యాచ్‌లలో ఓడింది. ఫైనల్ మ్యాచ్ హెడింగ్లీలో జరగ్గా అందులో నెగ్గిన ఇంగ్లండ్ సిరీస్ గెలిచింది. అయితే సిరీస్ ఓడినా కేవలం ఒక్క విషయం మాత్రం భారత అభిమానులను షాక్‌కు గురి చేసింది. అది అందరికీ తెలిసిందే.. అదేనండీ.. ఆ మ్యాచ్ అయ్యాక ధోని అంపైర్ల నుంచి బాల్‌ను తీసుకున్నాడు గుర్తుంది కదా.. అదే.. చర్చనీయాంశమైంది.
ధోనీ అలా మ్యాచ్ ముగిశాక బాల్‌ను తీసుకోవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ధోనీ ఇక వన్డేలు, టీ20ల నుంచి కూడా తప్పుకుంటాడని అందరూ అనుకున్నారు. టెస్ట్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ ఇక మిగిలిన రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెబుతాడని, అందుకే ఆ బాల్‌ను తీసుకున్నాడని ఫ్యాన్స్ గుసగుసలాడారు. ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అయ్యాయి.
అయితే ధోనీ అలా బాల్‌ను ఎందుకు తీసుకున్నాడో తాజాగా తెలియజేశాడు. వచ్చే సంవత్సరం.. అంటే.. 2019 మే 30 నుంచి జూలై 14వ తేదీ వరకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ క్లబ్స్ ఆధ్వర్యంలో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. అందులో భాగంగా భారత్ మరోసారి ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఇంగ్లండ్ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. కనుక వరల్డ్ కప్ కోసం ఫాస్ట్ బౌలర్లు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. అలా కావాలంటే.. ఇంగ్లండ్‌లో పిచ్‌లపై బాల్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఓవర్లకు బంతి ఎలా మారుతుంది, దాంతో ఎలా బౌలింగ్ చేయవచ్చు.. అనే అంశాలను పరిశీలించేందుకు, అందుకు తగిన విధంగా బౌలర్లకు కోచింగ్ ఇచ్చేందుకు గాను ఆ బంతిని తీసుకున్నానని ధోనీ తెలిపాడు. అందుకే మ్యాచ్ అయిపోగానే అంపైర్ల నుంచి బంతిని తీసుకుని దాన్ని టీమిండియా బౌలింగ్ కోచ్‌కు అందజేశానని తెలిపాడు. అదీ.. మహీ.. ఆలోచన. నిజంగా ఇలాంటి వ్యూహాలు అమలు చేయడంలో, ప్రణాళికలు రచించడంలో ధోనీకి ధోనీయే సాటి కదా..!