ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఈ కప్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించలేమని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేయగా.. తాజాగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీఎల్ టోర్నీకి లైన్ క్లియర్ అయింది.
కాగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలా, వద్దా అనే విషయంపై గత కొద్ది రోజులుగా ఐసీసీ మల్లగుల్లాలు పడుతోంది. ఓ దశలో నిర్వహించాలనే అనుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. అయితే అనూహ్యంగా కరోనా విజృంభిస్తుండడంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా టోర్నీ నిర్వహణకు విముఖత వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీసీ వరల్డ్ కప్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా తర్జన భర్జనలు పడింది. ఎట్టకేలకు ఐసీసీ బోర్డు సభ్యులు సోమవారం సమావేశమై టీ20 వరల్డ్ కప్‌ను అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక టీ20 వరల్డ్ కప్ కచ్చితంగా వాయిదాపడుతుందని ముందు నుంచే వార్తలు వస్తున్న విషయం విదితమే. చివరకు అదే జరిగింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 టోర్నీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే 2020ని ఐపీఎల్ లేకుండా ముగించబోమని అన్నారు. దీంతో తాజాగా ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అవడంతో ఇప్పుడిక బంతి బీసీసీఐ కోర్టులోకి చేరినట్లయింది. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీని ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి. అయితే వాయిదాపడ్డ టీ20 వరల్డ్‌కప్‌ను కుదిరితే 2021 లేదా 2022లో నిర్వహించే అవకాశం ఉంది.