కరోనా సోకి ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్న బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేదు వార్త చెప్పింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రైవేటు హాస్పిటల్స్ ఎంత ఫీజు వసూలు చేయాలనే విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన ధరలను నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక జీవోను కూడా విడుదల చేసింది. దాని ప్రకారం ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వం సూచించిన మేర చార్జిలను కరోనా పేషెంట్ల నుంచి వసూలు చేసుకోవచ్చు. అయితే సదరు జీవోలో తాజాగా ప్రభుత్వం మరొక కొత్త నిబంధనను చేర్చింది.
కరోనా సోకిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ కింద ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందే సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు వర్తించవు. అలాగే స్పాన్సర్‌షిప్ గ్రూప్‌లు, కార్పొరేట్ సంస్థలు హాస్పిటళ్లతో ఒప్పందాలు, ఎంవోయూలు చేసుకున్న వారికి కూడా కరోనా చికిత్సకు ప్రభుత్వం సూచించిన రేట్లు వర్తించవు. నేరుగా ఫీజులు చెల్లించేవారికే ప్రభుత్వ రేట్లు వర్తిస్తాయి.
కాగా కొత్తగా చేర్చిన నిబంధనకు సంబంధించి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఒక పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశారు. అంటే.. ఇకపై ప్రయివేటు హాస్పిటళ్లలో కరోనాకు చికిత్స పొందే వారు ఎలాంటి ఇన్సూరెన్స్ వాడకుండా, ఇతర ఏ అవకాశాలను వాడుకోకుండా చికిత్స తీసుకుంటేనే ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అవి వాడుకుంటే ప్రయివేటు హాస్పిటళ్ల వారు తమ ఇష్టానుసారం చార్జిలను వసూలు చేయవచ్చన్నమాట.