బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమైందంటూ నటి రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి తాజాగా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు రియా చక్రవర్తి సహా మొత్తం 6 మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో ఐపీసీ సెక్షన్ 306 కూడా ఒకటి. ఏ వ్యక్తినైనా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినా, లేదా ఇతర చర్యల వల్ల అందుకు పురికొల్పినా నిందితులు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు.
ఎవరినైనా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే నిందితులకు ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే నిర్దిష్టమొత్తంలో జరిమానా కూడా విధిస్తారు. ఇక సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు నటి రియా చక్రవర్తే కారణమని ఇప్పటికే ఫ్యాన్స్ ఆరోపిస్తుండగా, సుశాంత్ తండ్రి కూడా ఇదే విషయం నిజమని చెబుతూ కేసు పెట్టారు. రియా చక్రవర్తి సుశాంత్ క్రెడిట్ కార్డులను యూరప్‌లో విచ్చలవిడిగా వాడుకుందని, అతని బాడీ గార్డుల్లో ఒకరిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించిందని తేలింది. అలాగే ఆమెకు సుశాంత్ కంపెనీలో వాటాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది.
కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోగా.. ఈ కేసు విషయంలో ఇప్పటికే పోలీసులు సుమారుగా 40 మందిని విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్, దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలి, ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రా తదితరులు ఉన్నారు. ఇక పోలీసులు సుశాంత్ కుక్ నీరజ్ సింగ్, సహాయకుడు కేశవ్ బచ్‌నెర్, మేనేజర్ దీపేష్ సావంత్, క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ రామ్‌నాథ్ మూర్తి పితాని, సోదరిలు నీతు, మీతు సింగ్‌లను కూడా విచారించారు.