తీపి పదార్థాలంటే మనలో అధికశాతం మందికి ఇష్టం ఉంటుంది. చక్కెరతో చేసే ఏ వంటకాన్ని అయినా చాలా మంది ఇష్టంగా తింటారు. తినుబండారాలు, జంక్‌ఫుడ్, ఇతర బేకరీ ఐటమ్స్.. ఏవైనా సరే.. తీపి పదార్థం అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. కానీ ఆయా పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్, స్థూలకాయం, గుండె జబ్బులు వస్తాయి. కనుక వాటిని అతిగా తినరదు. అయితే కొందరు తీపి పదార్థాలను తినే యావను కంట్రోల్ చేసుకుంటారు. కానీ కొందరు నియంత్రించుకోలేరు. దీని వల్ల వారు అతిగా తీపి పదార్థాలను తింటారు. అలాంటి వారు కింద సూచించిన సూచనలు పాటిస్తే.. తీపి తినాలనే కోరికను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
* ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలను నిత్యం తీసుకోవాలి. వాల్‌నట్స్, బాదంపప్పు కూడా తినవచ్చు. వీటి వల్ల శరీంలో ఉండే కొవ్వు కరుగుతుంది. నిత్యం గుప్పెడు నట్స్ లేదా ఆయిల్స్ అయితే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో తీపి తినాలనే కోరిక నశిస్తుంది.
* ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల చక్కెర ఎక్కువగా తినాలనే కోరిక నశిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు తదితర పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తీపి తినాలన్న ఆసక్తి ఉండదు.
* దాల్చిన చెక్క పొడిని నిత్యం తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే తీపి పదార్థాలపై ఆసక్తి సన్నగిల్లుతుంది.
* నిత్యం తగినన్ని గంటలపాటు నిద్రించకపోయినా అది మనం తినే తిండిపై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల శరీరంలో పలు హార్మోన్లు విడుదలై మనం ఎక్కువగా ఆహారం తీసుకునేలా చేస్తాయి. దీని వల్ల సహజంగానే మనం తీపి పదార్థాలను ఎక్కువగా తింటాం. కనుక దీన్ని నివారించాలంటే నిత్యం తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. దీని వల్ల తీపి పదార్థాలను తినాలనే కోరిక పూర్తిగా నశిస్తుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.