షిప్​ యార్డ్ ఘటనలో అల్లుడు మృతి.. చూసేందుకు వెళ్తూ కుటుంబానికి ప్రమాదం

-

విశాఖలో షిప్‌యార్డ్‌ ఘటనలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ఇద్దరితోపాటు, కారు డ్రైవర్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వీరు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

Accident
Accident

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్‌పూర్‌కు చెందిన నాగమణి(48), ఆమె కుమారులు రాజశేఖర్‌, ఈశ్వరరావు, ఇద్దరు కోడళ్లు పెతిలి, లావణ్య(23)లతో కలిసి శనివారం మధ్యాహ్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ క్రేన్‌ ప్రమాదంలో మరణించిన తమ అల్లుడు పి.భాస్కర్‌రావును చూసేందుకు కారులో విశాఖకు బయలుదేరారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జలంతర కోట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగమణి, లావణ్య, డ్రైవర్‌ రౌతుద్వారక(23) అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు క్షతగాత్రులను సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజశేఖర్‌, పెతిలి స్వల్పంగా గాయపడగా.. ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. సోంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సోంపేట సీఐ సతీశ్‌, ఎస్సై దుర్గాప్రసాద్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news