కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు చేయూతను అందించేందుకు గాను కేంద్రం జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన వీధి వ్యాపారులకు రూ.10వేల రుణం ఇస్తారు. దాన్ని ఏడాదిలోగా వాయిదాల రూపంలో చెల్లించాలి. దీనికి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోంది. అయితే దీన్ని మరింత మంది వీధి వ్యాపారులకు అందజేయాలనే ఉద్దేశంతో కేంద్రం మరో సులభతరమైన ప్రక్రియను ప్రవేశపెట్టింది. అదేమిటంటే..
పీఎం స్వనిధి పథకం కింద రూ.10వేల రుణం పొందాలంటే వీధి వ్యాపారులకు తాము వ్యాపారం చేస్తున్నట్లు ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. లేదా అలాంటి వ్యాపారులకు చెందిన ఏదైనా సంఘంలో సభ్యత్వం ఉన్నట్లుగా గుర్తింపు కార్డును సమర్పించాలి. అలాంటి వారికే ప్రస్తుతం రుణాలు ఇస్తున్నారు. అయితే వీరే కాకుండా.. ఐడీ కార్డులు, ఇతర ధ్రువపత్రాలు లేని వీధి వ్యాపారులు కూడా ఈ పథకం కింద ప్రస్తుతం రుణం తీసుకోవచ్చు. అందుకు గాను వారు లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్‌వోఆర్)ను స్థానిక సంస్థల నుంచి పొందాల్సి ఉంటుంది.
వీధి వ్యాపారులు ఎల్‌వోఆర్‌ను పొందేందుకు పీఎం స్వనిధి వెబ్‌సైట్‌లో తమ వద్ద ఉన్న ఏదైనా పత్రాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వాల నుంచి పొందిన లబ్ధి తాలూకు ఆధారాలను లేదా తమ సంఘానికి చెందిన పత్రాలను లేదా ఇతర గుర్తింపు కార్డులను ఇచ్చి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా స్థానిక సంస్థల అధికారుల వద్దకు వెళ్లి విషయాన్ని వివరించి తమకు ఎల్‌వోఆర్ ఇవ్వాలని కోరవచ్చు. దీంతో వారు విచారణ చేసి, వీధి వ్యాపారులు అవునా, కాదా.. అనే వివరాలను నిర్దారించి వారికి 15 రోజుల్లోగా ఎల్‌వోఆర్‌ను ఇస్తారు. ఆ ఎల్‌వోఆర్‌తోపాటు వీధి వ్యాపారులకు వారు వీధి వ్యాపారులు అని తెలియజేసే గుర్తింపు కార్డు ఇస్తారు. దీంతో వారు పీఎం స్వనిధి కింద దరఖాస్తు చేసుకుని రూ.10వేల రుణం పొందవచ్చు.
కాగా గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు లేని వీధి వ్యాపారులకు ఇలా ఎల్‌వోఆర్‌ను ఇవ్వాలని కేంద్రం శుక్రవారమే నిర్ణయించింది. దీంతో మరింత మంది వీధి వ్యాపారులకు ఈ పథకం వల్ల లబ్ధి కలగనుంది. ఇక ఇప్పటికే పీఎం స్వనిధి పథకం కింద జూలై 2వ తేదీ వరకు మొత్తం దేశవ్యాప్తంగా 4.45 లక్షల అప్లికేషన్లు రాగా.. వారిలో 82వేల మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రుణాలను అందించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం వల్ల సుమారుగా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.