తెలంగాణ బీజేపీలో ధిక్కార స్వ‌రాలు.. బండి సంజ‌య్ టార్గెట్‌గా కొత్త రాజకీయం..!

-

క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ స‌భ్యుడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. పార్టీని గ్రామస్థాయికి విస్త‌రించే పనిలో ఆ పార్టీ కోర్ క‌మిటీ నిర్ణ‌యాలుంటున్నాయి. పార్టీలోని సీనియ‌ర్ల‌ను స‌రైన విధంగా స్థానాల్లో కూర్చోబెడుతూనే యువ నాయ‌కుల‌కు ప‌ద‌వులు క‌ల్పించే విధంగా క‌మిటీల్లో కూర్పు చేస్తున్న‌ట్లుగా ముఖ్య నేత‌లు చెబుతూ వ‌స్తున్నారు. అయితే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన రాష్ట్ర క‌మిటీలో జిల్లాల నేత‌ల‌కు స‌రైన న్యాయం జ‌రగ‌క‌పోగా, కొన్ని జిల్లాల నుంచి అస‌లే ప్రాతినిధ్యం క‌ల్పించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు సంజ‌య్‌ను చుట్టు ముడుతున్నాయి.

వాస్త‌వానికి 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లో అనూహ్యంగా వచ్చాయి. కాంగ్రెస్‌లో ముగ్గురికి, బీజేపీలో నలుగురికి పట్టం గట్టారు. 16 సీట్లు తమవే అనుకున్న టీఆర్‌ఎస్‌ను తొమ్మిదికి పరిమితం చేశారు. ముఖ్యంగా బీజేపి రాష్ట్రంలో అనుహ్యంగా పుంజుకున్న సంకేతాలు వెలువ‌డ్డాయి. పార్టీ అధిష్ఠానం కూడా తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతూ వ‌స్తోంది. తెలంగాణలో బలపడేందుకు తెర వెనక అనూహ్యంగా పావులు కదుపుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈక్ర‌మంలోనే పార్టీ విస్త‌ర‌ణ‌పై బండి సంజ‌య్ దృష్టి పెట్టారు.భారతీయ జనతా పార్టీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆదిలాబాద్ జిల్లా ఒక‌టి. ఇక్క‌డ పార్టీకి గ‌త లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో ఎంపీగా సోయం బాబురావును గెలిపించిన విష‌యం తెలిసిందే. పార్టీకి ఇప్పుడిప్పుడే గ‌ట్టి పునాదులు పడుతున్నాయ్‌.

బండి సంజయ్ తాజాగా పూర్తి రాష్ట్ర‌ కార్యవర్గాన్ని ప్రకటించ‌డంతో శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కొంది. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులను ఉపాధ్యక్షులుగా నియమించారు.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి ప్రధానకార్యదర్శులుగా నియమితుయ్యారు. రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి తదితరులు కార్యదర్శులుగా కొత్త కార్యవర్గంలో కొలువుదీరారు. బండారి శాంతి కుమార్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు. అయితే పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ క‌మిటీలో ఈసారి మంచి జిల్లా పార్టీ నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని ఆశించారు.

అయితే ఈ క‌మిటీలో ఎక్క‌డా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత‌లు లేక‌పోవ‌డంతో పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నేతలకు బండి సంజయ్ అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికీ అధిష్టానం చాన్స్ ఇవ్వకపోవడంపై ఉమ్మడి జిల్లా కమలనాథులు ఆగ్రహంతో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధిష్టానంతో తేల్చుకునేందుకు జిల్లా శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news