టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లపై మరోమారు చార్జిల మోత మోగించనుందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మొబైల్ డేటాకే భారీగా వసూలు చేయనున్నట్లు తెలిసింది. సాక్షాత్తూ ఆ సంస్థ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ స్వయంగా ఈ విషయంపై హింట్ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ఓ ప్లాన్‌లో రూ.160కి 16 జీబీ డేటాను ఇస్తున్నామని సునీల్ మిట్టల్ అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ చార్జి అని అన్నారు. సాధారణంగా 1 జీబీకి ఖరీదు రూ.100 ఉంటే తప్ప తమకు గిట్టుబాటు కాదని, వ్యాపారంలో నష్టాలు వస్తాయన్నారు. అందువల్ల రూ.160 చెల్లిస్తే వినియోగదారులకు ఇకపై 1.6 జీబీ డేటా మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంటే.. రూ.100కు 1 జీబీ డేటాను మాత్రమే పొందుతారని అన్నారు.
సాధారణంగా తమకు నెలకు ఒక్క కస్టమర్ నుంచి రూ.300 వరకు ఆదాయం వస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని సునీల్ మిట్టల్ తెలిపారు. దీన్నే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) అంటారన్నారు. అయితే రానున్న 6 నెలల్లో ఏఆర్‌పీయూ కనీసం రూ.200 దాటాలన్నారు. అందుకు చార్జిలను పెంచక తప్పదన్నారు. కాగా ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ జూన్ నెల వరకు రూ.157గా ఉంది. అయితే గతేడాది డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ చార్జిలను పెంచింది. అందువల్ల వచ్చే డిసెంబర్‌లో మళ్లీ చార్జిలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇకపై ఎయిర్‌టెల్‌లో డేటాను ఇష్టం వచ్చినట్లు వాడుతామంటే కుదరదు. అందుకు భారీగా చెల్లించాల్సిందేనని స్పష్టమవుతుంది.