ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉంటాం… భవిష్యత్తులో అధికారపక్షం లోకి వస్తాం అంటూ పదేపదే బీజేపీ నేతలు చెప్తూ ఉంటారు మీడియా ముందు ఎక్కువగా. వారి వ్యాఖ్యలకు మీడియా కూడా కాస్త ఎక్కువగానే ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఏడాదికాలంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న కొందరు నేతలు పదేపదే సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తూ విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా సీఎం జగన్ బలంగా ఉండటంతో ఆయనను బలహీనపరచడానికి కొంతమంది నేతలు ఇప్పుడు కాస్త పట్టుదలగా వ్యవహరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీతో కలిసి వెళ్ళాలి అని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రయత్నాలు చేసి విజయవంతం అయింది. అంతవరకు బాగానే ఉంది కానీ… ఇప్పుడు బీజేపీని ప్రజలు ఎవరూ నమ్మడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు ఎందుకు నమ్మటం లేదు అనడానికి మూడు కారణాలున్నాయి.
ఒకటి… సీఎం జగన్ వ్యతిరేక వర్గం ఒకటి ఉంది. సీఎం జగన్ కి అనుకూల వర్గం బీజేపీలో మరొకటుంది. వీరు బీజేపీకే ఏ విధంగా కూడా ఉపయోగపడే వారు కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అని వైసీపీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి అని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఆయన గత ఏడాది కాలంగా జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తున్నారు. ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మినహా సోము వీర్రాజు సీఎం జగన్ ని గాని వైసిపి ప్రభుత్వాన్ని గానీ పెద్దగా విమర్శించిన దాఖలాలు అంటూ ఏమీ లేవు. ఇక జీవీఎల్ నరసింహారావు అదేవిధంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ పై అటు ఇటు కాకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఏపీ ప్రభుత్వంపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో అసలు ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా చేస్తుందని దీనిపై కేంద్రం విచారణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దానిపై స్పందించిన జీవీఎల్ నరసింహారావు అసలు మోడీ కి సంబంధం ఏంటి అని నిలదీయడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. విష్ణువర్ధన్ రెడ్డి కూడా దాదాపు వైసీపీ నేతలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు.
రెండు… ఆంధ్రప్రదేశ్ లో బిజెపి గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కొందరు రాష్ట్ర పార్టీ నేతలు చంద్రబాబు కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వారు ఉన్నారు. వారిలో విష్ణుకుమార్ రాజు అలాగే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస రావు ఇక విశాఖ జిల్లాకు చెందిన కంభంపాటి హరిబాబు. వీరందరూ కూడా చంద్రబాబు నాయుడికి సన్నిహితంగానే ఉన్నారు. కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. విష్ణుకుమార్ రాజు కూడా ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాకపోయినా సరే ఆయన తెలుగుదేశం పార్టీలోకి గత ఎన్నికల సమయంలో రావాలని భావించారు. వీరు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం సంచలనంగా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సమయంలో కామినేని శ్రీనివాస రావు హై కోర్టులో కేసు వేశారు.
మూడు… ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నేతలు కొందరు సందర్భాన్నిబట్టి వ్యవహరిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ. అదేవిధంగా తలశిల రఘురాం వంటి వారు. తెలుగుదేశంకు ఒక సందర్భంలో అనుకూలంగా ఉండటం మరో సందర్భంలో వైసిపికి అనుకూలంగా ఉండటం చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వైసీపీనీ తిట్టినప్పుడు వైసిపీకి అండగా… వైసిపీ తెలుగుదేశం ను తిడితే తెలుగుదేశం పార్టీ కి అండగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అసలు వ్యవహారశైలి ఏంటి అని రాష్ట్ర ప్రజలు కూడా అర్థం కావడం లేదు.
ఈ మూడు కారణాలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం కాకపోవడానికి కారణం అనేది చాలా మంది మాట. ఉన్నమాట చెప్పాలంటే పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కొందరు తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారని వారు సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉంటారు అని ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి బయటకు వస్తే బిజెపి ఏపీలో కాస్తో కూస్తో బలపడే అవకాశాలు ఉంటాయి.