టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ 4.5 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.33,102 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ ఏడాది జూలైలోనే వివరాలను వెల్లడించిన విషయం విదితమే. అందులో భాగంగానే జియో ఈ ఏడాది చివరి వరకు చాలా తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్లను దేశంలోని మొబైల్ వినియోగదారులకు అందివ్వనుంది. వాటిని గూగుల్ ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది.
ఇక జియో లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్లలో బండిల్డ్ డేటా ప్యాక్స్‌ను అందిస్తుందని తెలిసింది. ఆరంభంలో 10 కోట్ల వరకు అలాంటి లో కాస్ట్ ఫోన్లను జియో విడుదల చేస్తుందని తెలిసింది. కాగా జియో విడుదల చేయనున్న ఆ ఫోన్లలో ప్రస్తుతానికి 4జి సేవలను అందిస్తారు. భవిష్యత్తులో 5జి సేవలను కూడా అందించే అవకాశాన్ని జియో పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అయితే జియో గనక తక్కువ ధరలకే ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తెస్తే ఇప్పటికే ఎక్కువగా చెలామణీలో ఉండే షియోమీ, రియల్‌మి, ఒప్పో, వివో కంపెనీలకు దెబ్బ కలగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10 స్మార్ట్ ఫోన్లలో 8 ఫోన్లు చైనాకు చెందిన ఈ కంపెనీలవే ఉంటున్నాయి. అయితే జియో తక్కువ ధరలకే ఆండ్రాయిడ్ ఫోన్లను విడుదల చేస్తే ఆయా చైనా కంపెనీల మొబైల్ మార్కెట్‌కు గండి పడడం ఖాయంగా కనిపిస్తోంది.