తెలంగాణలో గత ఐదారేళ్లుగా ఏ ఎన్నిక వచ్చినా కారు జోరుకు తిరుగులేదు.. కేసీఆర్‌కు బ్రేకులేదు అన్నట్టుగానే ఉంది. 2014 సాధారణ ఎన్నికల నుంచి ఏ ఎన్నిక జరిగినా, ఉప ఎన్నిక అయినా, స్తానిక సంస్థల ఎన్నికలు అయినా, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు అయినా గెలుపు కారుదే. ఇక తెలంగాణలో ఇప్పటికే అన్ని ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. అన్నింట్లోనూ కారుదే పై చేయి. ఇప్పుడు మరోసారి వరుసగా ఎన్నికలు రానున్నాయి. నవంబర్‌లో సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. ఆ వెంటనే డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఎన్నికలు రానున్నాయి.
ఇక వచ్చే సంక్రాంతికి ముందుగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ వెంటనే ఖమ్మం నగర పాలక సంస్థకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏదేమైనా మరో ఐదారు నెలల పాటు తెలంగాణలో ఈ ఎన్నికల హడావిడి ఉంటుంది. ఇక వీటిలో అత్యంత ముఖ్యమైనవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. గ్రేటర్లో కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలుగా ఉన్న స్థానాలు బద్దలు కొట్టి ఏకంగా వార్ వన్‌సైడ్ చేసేసింది. గ్రేటర్లో పట్టు ఉంటుందని అనుకున్న టీడీపీ కేవలం కేపీహెచ్‌బీ కార్పొరేటర్ స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక ఇప్పుడు మరోసారి గ్రేటర్ వార్‌కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ మూడో వారంలో ఈ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా డిజవిన్లలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. ఎన్నికల విషయంలో ఈ సారి మంత్రి కేటీఆర్ అంతా తానై ఉండనున్నారు. ఆయన అంతర్గతంగా నాలుగు సర్వేలు కూడా చేయించారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్ గెలుపునకు తిరుగులేదని తేలిందట. అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్కు 95 – 115 మధ్యలో సీట్లు వస్తాయని తేలిందట.
ఇక ఎంఐఎం ఎలాగూ 35 – 40 డివిజన్లు సులువుగానే గెలుచుకుంటుంది. ఈ విషయంలో ఎవరికి సందేహాలు లేకపోయినా టీఆర్ఎస్ పట్ల గతంతో పోలిస్తే వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా గ్రేటర్లో సమస్యలు కోకొల్లుగా ఉన్నాయి. కూకట్పల్లి లాంటి ప్రధాన రహదారుల్లో కూడా మోకాలి లోతు గుంతలు ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు ఎక్కువుగా ప్రమాదాలకు గురవుతున్నారు. బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ ఘోరం. ఐదేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా ఈ సారి 100 సీట్లు రావడం కలే అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సారి గ్రేటర్లో కాంగ్రెస్ కంటే బీజేపీ నుంచే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్సులు ఉన్నాయి.
-vuyyuru subhash