ఇంతకీ మురళీధరన్‌ చేసిన తప్పేంటి…?

-

స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రను 800 పేరుతో తెరకెక్కించాలని భావించినప్పుడు ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పటికే వచ్చిన చాలా బయోపిక్స్‌లో ఇదీ ఒకటవుతుందనుకున్నారు. కానీ… ఈ చిత్రంలో మురళీధరన్‌ పాత్రకు తమిళ నటుడు విజయసేతును ఎంపిక చేయడంతోనే వివాదం రాజుకుంది. విజయ సేతుపతిని ఎంపిక చేయగానే ఎందుకింత అగ్గి రాజుకుంది. ఈ మురళీధరన్‌ చేసిన తప్పేంటి…

శ్రీలంకలో తమిళులపై ఉక్కుపాదం మోపిన మాజీ అధ్యక్షుడు మహింద రాజక్సేకు మద్దతు ప్రకటించడమే మురళీధరన్‌ చేసిన తప్పు. శ్రీలంకలో సుమారు 30 ఏళ్ల పాటు తమిళుల పోరాటం సాగింది. ఈలం ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి గల తమిళ రాజ్యంగా ఏర్పాటు చేయడానికి లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్ ఈలం – LTTE ప్రయత్నించింది. తమిళ పులుల అంతర్యుద్ధాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఊచకోతలకు తెరలేపింది అధ్యక్షుడు రాజక్సే నేతృత్వంలోని లంక ప్రభుత్వం. లక్షల మంది తమిళులను అతికిరాతకంగా చంపించింది. బాంబింగ్‌, కాల్పుల్లో చనిపోయిన వాళ్లే కాదు… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న సామాన్యుల్ని కూడా అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపారు సింహళి సైనికులు.

తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వానికి మురళీధరన్ మద్దతుగా ఉన్నాడని సోషల్‌ మీడియాలో కొంత మంది మండిపడుతున్నారు. 2009లో అంతర్యుద్ధం ముగిసినప్పుడు మురళీధరన్‌ ఆనందం వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతున్నారు. తమిళ సినీ నిర్మాత భారతీరాజా మరింత తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. మురళీధరన్ భారత దేశ ద్రోహి అన్నారాయన. ఓ వైపు తమిళులను శ్రీలంక బలగాలు ఊచకోత కోస్తుంటే… మురళీధరన్ ఆ దేశం కోసం క్రికెట్ ఆడాడని విమర్శించారు భారతీ రాజా. తమని మురళీధరన్ దారుణంగా వంచించాడని విరుచుకుపడ్డారు భారతీ రాజా.

మురళీధరన్‌పై విమర్శల చేయడమే కాదు… అతని బయోపిక్‌లో నటిస్తున్న విజయ సేతుపతికి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు భారతీ రాజా. తమిళులకు ద్రోహం చేసిన మురళీధరన్‌ బయోపిక్‌లో నటిస్తే… తమిళ చరిత్రలో నీకు చోటుండదంటూ విజయ్ సేతుపతిని హెచ్చరించారు. ఈ విషయంలో విజయ్‌ సేతుపతికి… దక్షిణాది సీనియర్‌ నటి రాధిక, ఆమె భర్త శరత్‌కుమార్‌ అండగా నిలిచారు. నటులకు రాజకీయాలు అంటగట్టవద్దని సూచించారు. సినిమాను సినిమాగానే చూడండంటూ ట్వీట్‌ చేశారు. IPL ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మురళీధరన్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నాడని గుర్తు చేశారామె. పైగా ఆ జట్టు యజమానులైన సన్‌ టీవీకి ఓ తమిళ రాజకీయ పార్టీతో అనుబంధం కూడా ఉందన్నారు. అయితే, రాజకీయాలు, క్రీడలు, వినోదం వేరే విషయాన్ని చాటి చెప్పేలా ఇంత వరకూ ఆ సంస్థ వ్యవహరిస్తూ వస్తోందన్నారామె.

తమిళ చిత్రపరిశ్రమకు అది ఎందుకు స్ఫూర్తి కాకూడదని ప్రశ్నించారు నటి రాధికా శరత్‌కుమార్‌. తమిళులకు సంబంధించిన క్రికెట్‌ టీమ్‌కు మురళీధరన్‌ శిక్షకుడిగా ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని వాళ్లు… అతని బయోపిక్‌లో విజయ్‌ సేతుపతి నటించడానికి వీల్లేదనడంలో అర్థం లేదంటూ ట్విట్టర్‌ వేదికగా కడిగి పారేశారు రాధిక. దీంతో రాధిక ట్వీట్‌ను పలువురు రీట్వీట్‌ చేస్తున్నారు.

మొత్తానికి రాజకీయాలు వేరే క్రీడలు, వినోదం వేరని… రెండింటికీ ముడిపెట్టకూడదనే చర్చకు తెరలేపారు రాధిక.

Read more RELATED
Recommended to you

Latest news