ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన దారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వాహన చట్టంలో మార్పులు తీసురావడంతో పాటుగా, నిబంధనలు ఉల్లంఘించిన వారికీ భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. వాహనాలను తనిఖీ చేసే సమయంలో అవసరమైన సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధిస్తారు. మోటారు సైకిళ్లు, 7 సీటర్ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీవాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750, సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే – రూ. 750, అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000, అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10 వేలు జరిమానా విధిస్తారు.
నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000, వేగంగా బండి నడిపితే – రూ. 1000, సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000, రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000 జరిమానా విధించనున్నారు. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000, పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000, ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నుకు రూ. 2000 అదనంగా జరిమానా వసూలు చేయనున్నారు. వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 1000, అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా విధించనున్నారు. పదేపదే నిబంధనల ఉల్లంఘనకు డ్రైవింగ్ లైసెన్సును కూడా జప్తు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో రవాణా శాఖ పేర్కొంది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసింది.