సాధారణంగా ప్రతి ఏడాది ధంతేరస్, దీపావళి సందర్భంగా జనాలు బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు. బంగారు ఆభరణాలు ధరించి నలుగురిలోనూ తిరిగితే జనాలు ప్రెస్టిజ్గా భావిస్తారు. అందుకనే బంగారంపై పెట్టుబడుల కన్నా చాలా మంది భౌతిక రూపంలో బంగారాన్ని కొనేందుకే ఆసక్తిని చూపిస్తారు. అయితే గతేడాది ఇదే సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు 31 శాతం పెరిగాయి. కరోనా నేపథ్యంలో బంగారంపై చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇదే విషయంపై పలువురు మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కనుక బంగారం కొనాలనుకునే వారు ముందుగా వారు చెబుతున్న అభిప్రాయాలను ఒక్కసారి చదవండి.
ముంబైకి చెందిన కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వీపీ రవీంద్ర రావు మాట్లాడుతూ.. భారతదేశంలో బంగారాన్ని ప్రజలు ఆస్తిగా భావిస్తారు. సంప్రదాయాలకు అనుగుణంగా బంగారు ఆభరణాలను ధరిస్తారు. ధంతేరస్ సమయంలో బంగారాన్ని ఎక్కువగా కొంటారు. అయితే బంగారాన్ని భౌతిక రూపంలో కొనడం కన్నా దానిపై పెట్టుబడులు పెడితే ఇంకా మంచిది. ఇప్పుడు కాకుండా రానున్న రోజుల్లో బంగారానికి ధరలు తగ్గే అవకాశం ఉంది. కనుక ఆ సమయం వరకు వేచి చూసి అప్పుడు బంగారంపై పెట్టుబడులు పెడితే మంచిది. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు.
న్యూఢిల్లీకి చెందిన వెల్త్ డిస్కవరీ డైరెక్టర్ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది బంగారానికి ధర చాలా పెరిగింది. కోవిడ్ నేపథ్యంలో పెట్టుబడి దారులు బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెడితే సేఫ్ అని చాలా మంది భావిస్తుండడమే ఇందుకు కారణం. అయితే కోవిడ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్నప్పటికీ రానున్న రోజుల్లో వ్యాక్సిన్ వస్తే అప్పుడు దాని ప్రభావం బంగారంపై పడే అవకాశం ఉంటుంది. అప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. పెట్టుబడిదారులు ఇతర రంగాలపై పెట్టుబడులు పెట్టేందుకు దృష్టి సారిస్తారు. కనుక కొంత కాలం వరకు వేచి చూశాక బంగారం కొంటే మంచిది. తక్కువ ధరలకే బంగారం లభించేందుకు అవకాశం ఉంటుంది.
చూశారు కదా.. ధంతేరస్ అని చెప్పి, బంగారు ఆభరణాల షోరూంల వారు ఊదరగొడుతున్నారని ఆశపడి ఇప్పుడే బంగారం కొనకండి. కొద్ది రోజులు ఆగితే ధరలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక అప్పటి వరకు నిరీక్షించి ఆ తరువాత బంగారం కొనండి. తక్కువ ధరలకే బంగారం లభించే అవకాశం ఉంటుంది.