స్కాట్లండ్ దేశం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే తొలి సారిగా రుతు సంబంధ ప్రొడక్ట్స్‌ను ఆ దేశ మహిళలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్కాట్లండ్ ఈ సదుపాయం అందిస్తున్న మొదటి దేశంగా నిలిచింది. ఇకపై అక్కడ పీరియడ్ ప్రొడక్ట్స్ ను మహిళలకు ఉచితంగా అందివ్వనున్నారు. ఈ క్రమంలో వారికి కావల్సిన శానిటరీ ప్యాడ్స్ తదితర ఉత్పత్తులు ఉచితంగా లభిస్తాయి.
స్కాట్లండ్‌లో గతేడాదే పీరియడ్ ప్రొడక్ట్స్ బిల్‌ను ప్రవేశ పెట్టగా దానికి ఇప్పుడు ఆమోదం లభించింది. ఈ క్రమంలో ఆ దేశ మహిళలందరూ రుతు సమయంలో ప్రభుత్వం అందించే ప్రొడక్ట్స్ ను ఉచితంగా వాడుకోవచ్చు. అన్ని కమ్యూనిటీ సెంటర్లతోపాటు స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రదేశాల్లో సదరు ప్రొడక్ట్స్‌ను మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై అక్కడ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
కాగా ఈ సదుపాయం అందిస్తున్నందుకు గాను ఆ దేశంపై 2022 వరకు 8.7 మిలియన్ పౌండ్ల భారం పడనుంది. అయినప్పటికీ స్కాట్లండ్‌లో ఉన్న 20 శాతం మంది పేద మహిళల కోసం ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అభిప్రాయ పడ్డాయి. అందుకనే ఆ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభిచింది.