తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో పెద్ద పులులు టెన్షన్ కలిగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో పులి సంచారంతో ప్రజలు కంటి మీద కునకులేకుండా పోతోంది. కుమ్రం భీమ్ జిల్లాలో యువకుడిని పొట్టనపెట్టుకున్న పెద్దపులి, మహబూబాబాద్ జిల్లా గూడూరు-కొత్తగూడ ప్రాంతంలో పశువుల పై దాడి చేసింది. ఇప్పుడు తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద వాగు ప్రాంతంలో పెద్ద పులి నీరు తాగుతూ కనిపించడంతో కొందరు యువకుల వారు సెల్‌ఫోన్లతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పెద్దపులి టెన్షన్ పెట్టింది.
కొద్దిసేపటి క్రితం భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో బూర్గంపహాడ్ మండలం లో తిరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీన్ని అటవీశాఖ అధికారులు కూడా అధికారికంగా ధ్రువీకరించారు. నాలుగు రోజుల క్రితం పినపాక, ఇల్లందు అటవీ పరివాహక ప్రాంతంలోని ఆళ్లపల్లి మండలం మర్కోడు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరిగింద. అక్కడ సత్యనారాయణ అనే ఆదివాసీ గిరిజన రైతు ఒక దుక్కిటెద్దుని చంపింది. అనంతరం కరకగూడెం నుంచి బూర్గంపాడు సమీపంలో కి సారపాక వద్ద పుష్కర వనం వద్దకు చేసుకున్నట్లు తెలుస్తోంది . భద్రాచలం పట్టణం గోదావరి అవతలి వైపు నాగినేని పాలెం, రెడ్డి పాలెం, కృష్ణ సాగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.