సరిహద్దు రాజకీయం..కర్ణాటక పై ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయి ?

-

ఏపీ, కర్నాటక సరిహద్దులు గుర్తించే వ్యవహారం సడెన్‌గా నిలిచిపోయింది. సర్వే ఆఫ్‌ ఇండియా.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్నీ చూసుకుని రాళ్లు పాతేద్దామని అనుకున్నారు. ఈలోగా మనసు మార్చుకున్న కర్నాటక.. తూచ్‌ అంది. ఇంతకీ కర్నాటక ఎందుకు బ్రేక్‌ వేసింది..ఎవరి ఒత్తిళ్లు పని చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక సరిహద్దుల్లో ఐరన్‌ ఓర్ తవ్వకాలు ఒకానొక సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కేసులు, వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా రాష్ట్రాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రభుత్వ అనుమతితో అనంతపురం జిల్లా, కర్ణాటకలోని బళ్లారిలో ఇనుప ఖనిజం తవ్వకం చేపట్టినా.. అక్కడ లీజుకు తీసుకున్నవారు ఎంత తవ్వుతున్నారు.. ఎక్కడ మైనింగ్‌ చేస్తున్నారన్నది ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనికి బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. అనేక వివాదాలు, మలుపులు తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల నిర్ణయానికి ప్రయత్నాలు జరిగినా సమస్య మాత్రం కొలిక్కి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో సరిహద్దులను గుర్తించేందుకు సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు రంగంలోకి దిగారు. అనంతపురం, బళ్లారి అధికారుల సమక్షంలో సరిహద్దు పిల్లర్లు వేయాలని భావించారు సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు. దీనికి సంబంధించిన కొలతలు అన్నీ పూర్తయ్యాయి. మొత్తం 70 పాయింట్లలో పిల్లర్లు వేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియకు ఉన్నట్టుండి బ్రేకులు వేసింది కర్నాటక ప్రభుత్వం. సర్వే జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చింది.

డీ మార్కేషన్‌ రాళ్లు ఎక్కడికి జరిగాయన్నది సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించడంతో ఆ వివరాలు కోరింది కర్ణాటక. దీంతో సర్వే ఆగిపోయింది. అత్యాధునిక పరికరాలు… వందేళ్ల నాటి రికార్డులు తీసుకుని క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టినా.. సడెన్‌గా సర్వే ప్రక్రియ ఆగడానికి బలమైన రాజకీయ ఒత్తిళ్లే కారణమని అనుమానిస్తున్నారట. ఇప్పుడు సరిహద్దులు తేలితే అప్పట్లో ఎంత అక్రమ మైనింగ్‌ జరిగిందన్నది అరటిపండు వలిచినట్టు.. సీబీఐకి తెలిసిపోతుందని భయపడుతున్నారట. అందుకే కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సర్వేను అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక అభ్యంతరాలపై ఏపీ ఏం చెప్పిందో.. ఏం చెప్పాలనుకుంటుందో బయటకు రాలేదు. దీంతో మరికొన్ని రోజులు సరిహద్దు గుర్తింపు సమస్య తేలదనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారట ఇక్కడి అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశించినా.. సర్వే ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు రంగంలోకి దిగినా.. సమయం చూసుకుని సదరు రాజకీయ శక్తులు స్విచ్‌ ఆఫ్‌ చేశాయని అనుకుంటున్నారు. మరి.. ఈ సమస్య ఎప్పుడు ఒడ్డున పడుతుందో.. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఎప్పుడు తేలుతాయో ఆ దేవుడికే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news