మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం ఎందుకు.. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు.
ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని చెప్పింది. ఇక అంతే.. దీనిలో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అన్న పదం హనుమంతుడికి బాగా నాటుకుపోయింది. మరునాడు ఆంజనేయస్వామి తన శరీరమంతా సింధూరం రాసుకుని సభకు వెళ్లాడు. సభలో శ్రీరాముడు ఆంజనేయస్వామిని పిలిచి ఏమిటి ఇలా ఒళ్లంతా సింధూరం రాసుకున్నావు అని అడగగా సీతమ్మ తల్లి చెప్పిన జవాబు చెప్పాడు. అంతే రాముడు ఆంజనేయస్వామి భక్తికి పరవశుడయ్యాడు. వెంటనే ఒక వరం ఇచ్చాడు.
ఎవరైతే మంగళవారంనాడు హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారో, సింధూరం వేయిస్తారో వారి అభీష్టాలు సిద్ధిస్తాయి, ఆటంకాలు తొలిగి పనులు పూర్తవుతాయి అనే వరాన్ని శ్రీరాముడు ఇచ్చాడు. ఆనాటి నుంచి నేటివరకు హనుమంతుడుని ప్రసన్నం చేసుకోవడానికి, మనోభీష్టాలు తీర్చుకోవడానికి సింధూరం ధారణ చేయించడం జరుగుతుంది. ఇక ఆలస్యమెందుకు మీ సమస్యల పరిష్కారానికి హనుమంతుడికి భక్తితో, శ్రద్ధతో సింధూర ధారణ చేయించండి. నిత్యం సింధూర ధారణతో స్వామి కృపకు పాత్రులు కండి.
జై హనుమాన్!
– కేశవ