అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈరోజు దీక్షకు దిగుతామని జెసి బ్రదర్స్ పేర్కొనడంతో తాడిపత్రిలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తాడిపత్రిలోని జేసీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే అనంతపురం జిల్లా జూటూరులోని జెసి దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
తమ మీద నమోదైన అట్రాసిటీ కేసులు విషయంగా తాడిపత్రిలో ఈ రోజు నిరసన దీక్షకు దిగుతామని జెసి బ్రదర్స్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం ఎలాంటి నిరసనలకు చోటు లేదని చెబుతూ పట్టణంలో 144 సెక్షన్ విధించి పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. మరోపక్క జేసీ బ్రదర్స్ ఏమో పోలీసులు అనుమతి అవసరం లేదని తాము ఇప్పటికే తహసిల్దార్ దగ్గర అనుమతి తీసుకున్నామని చెబుతున్నారు. దీంతో జేసీ బ్రదర్స్ ఎలా అయినా నిరసనకు దిగుతారని భావిస్తున్న పోలీసులు వారిద్దరిని హౌస్ అరెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.