బీజేపీ భీష్ముడు వాజ్‌పేయి అస్తమయం

-

 

భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌క నాయ‌కుడు,భార‌త‌ర‌త్న, మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి (93) ఇవాళ క‌న్ను మూశారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జూన్ 11న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయ‌న్ను చేర్చారు. గ‌త 9 వారాల నుంచి ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ప్ప‌టికీ గ‌త 36 గంటల్లోనే వాజ్‌పేయి ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆయ‌న ఇవాళ తుదిశ్వాస విడిచారు. వెంటిలేట‌ర్‌పై ఆయ‌న‌కు ఎయిమ్స్ వైద్యులు చికిత్స‌నందించారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింద‌ని, ఆయ‌న మృతి చెందార‌ని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

వాజ్‌పేయి మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు పార్టీల అగ్ర నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు. కాగా 2009లో వాజ్‌పేయి స్ట్రోక్‌కు గురై జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోయారు. అప్ప‌టి నుంచి ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. వాజ్‌పేయి 10 సార్లు లోక్ స‌భ‌కు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మూడు సార్లు ప్ర‌ధానిగా ప‌నిచేశారు. 2014లో ఆయ‌న‌ భార‌త‌ర‌త్న అందుకున్నారు.

1957లో బ‌ల‌రామ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు వాజ్‌పేయి ఎన్నిక‌య్యారు. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా పని చేశారు. 1975 తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వాజ్‌పేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 1980 నుంచి 86 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వాజ్‌పేయి పని చేశారు. 1992లో పద్మ విభూషణ్, 1993లో కాన్పూర్ యూనివర్సిటీ నుంచి డి.లిటరేచర్‌లో గౌరవ పురస్కారం, 1994లో లోకమాన్య తిలక్ పురస్కారం, 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 1994లో భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు, 2014లో భారతరత్న అవార్డులు వాజ్‌పేయిని వ‌రించాయి.

స్వతహాగా మంచి కవి అయిన వాజ్‌పేయి, సరళమైన కవిత్వం అల్లేవారు. మేరీ ఎక్యావన్ కవితాయే, ట్వెంటీవన్ పోయెంస్, సెలెక్టెడ్ పోయెంస్ వంటి సంకలనాలు వెలువరించారు.

Read more RELATED
Recommended to you

Latest news