తెలంగాణలో రైతు బంధు పథకం అమలుతో రైతన్నల మనసులు గెలుచుకున్న సీఎం కేసీఆర్ ఫార్ములాను ప్రస్తుతం పక్క రాష్ట్రాలు సైతం కాపీ కొడుతున్నాయి. ఇందులో భాగంగానే రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో చేర్చుతూ.. కలియా (కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించారు. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్ వివరించారు. రుణ మాఫీ కంటే కూడా రైతు బంధు తరహాలో పథకం అమలుకు కార్యచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్ నిర్ణయంతో మరో సారి కేసీఆర్ పథకాల గురించి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.