11 ఏళ్ల తర్వాత కర్నూలు కార్పోరేషన్ ఎన్నికలు..వైసీపీ,టీడీపీ మధ్య ఆసక్తికర పోటీ

-

మున్సిపల్‌ కార్పోరేషన్లకు ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఒకటో, రెండో ఏళ్లు ఆలస్యం కావొచ్చు. కానీ, కర్నూలు మున్సిపల్‌ కార్పోరేషన్‌కు మాత్రం 11ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో చాలారోజుల తర్వాత నగరంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. కర్నూలు మేయర్ కుర్చీ సొంతం చేసుకోవడానికి రాజకీయపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కర్నూలు మేయర్ పదవి కోసం వైసీపీ, టీడీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్‌లో సుదీర్ఘ కాలంగా ఇంఛార్జీల పాలన కొనసాగుతోంది. కోర్టు కేసుల కారణంగా పదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. కర్నూలు మున్సిపాలిటీని 1994లో కార్పోరేషన్‌గా అప్ గ్రేడ్ చేశారు. 1995లో తొలిసారి ఎన్నికలు నిర్వహించగా.. ఎస్సీ కోటా కింద టీడీపీ నుంచి బంగి అనంతయ్య మేయర్‌గా ఎన్నికయ్యారు. రెండోసారి జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవిని జనరల్ కు కేటాయించారు. ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ బేగం మేయర్ గా ఎన్నికయ్యారు. 2000-2005 మధ్య కాలంలో ఆమె పాలన సాగింది. మూడోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రఘురామి రెడ్డి మేయర్ గా ఎన్నికయ్యారు.

కర్నూలు కార్పోరేషన్ కు 2010 తరువాత ఎన్నికలు జరగలేదు. అయితే గతేడాది ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు పోటా పోటీగా నామినేషన్లు వేశారు. అయితే కరోనా కారణంగా.. ఎన్నికల ప్రక్రియ అర్దాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలకు మోక్షం కలిగింది. ఈసారి మేయర్ స్థానాన్ని తొలిసారిగా బీసీలకు కేటాయించారు.

కర్నూలు మేయర్ పదవి కోసం వైసీపీ, టీడీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన కూడా.. ఈ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నాయి. కార్పోరేషన్ పరిధిలో మొత్తం 52 డివిజన్లు ఉండగా..614 మంది గతంలో నామినేషన్లు వేశారు. అందులో ఒకరు మృతి చెందారు. వీరిలో యువత, మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అభ్యర్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యూహాలు రచిస్తున్నాయి.

వైసీపీ మేయర్ అభ్యర్థిగా బీవై రామయ్యను ఖరారు చేసింది. టీడీపీ మేయర్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. పోలింగ్ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news