అమరావతి భూ వ్యవహారంపై సీఐడీ నోటీసులు విషయంలో ఇవాళ కోర్టును ఆశ్రయించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిఐడి కేసులో నమోదు అయిన ఎఫ్ ఐఆర్ ను టిడిపి ముందు నుండీ పూర్తిగా తప్పు పడుతోంది. ఈ విషయంలో విచారణకు హాజరు కాకుండానే కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. తమపై దాఖలు అయిన ఎఫ్ ఐఆర్ ను పూర్తిగా కొట్టివేయాలని టిడిపి కోర్టును కోరనుంది. నేడు కోర్టులో పిటిషన్ వేయనుంది.
కేసు పూర్వా పరాలపై ఇప్పటికే చర్చించిన టీడీపీ పెద్దలు ఈ కేసు అసలు నిలబడదని చెబుతున్నారు. ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో గతనెల 24న సీఐడీకి ఫిర్యాదు చేశారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం చట్ట విరుద్దంగా వ్యవహరించిందని పేర్కొంటూ అసైన్డ్ భూముల వ్యవహారంలో కొనుగోలుదారులకు అనుకూలంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది అని సిఐడీకి ఫిర్యాదు చేశారు. ఆర్కే ఫిర్యాదుపై విచారణ జరిపి చంద్రబాబు సహా ఇతర నేతలపై కేసు నమోదు చేసింది సీఐడీ.