ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై త్రిణమూల్ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని టీఎంసీ ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని ప్రవర్తన ఉందని ఫిర్యాదులో టీఎంసీ పేర్కొంది. పొరుగు దేశం గడ్డపై నుంచి రాష్ట్ర ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టారని పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ మీడియా రిపోర్ట్స్ ను కూడా జత చేశారు.
మరో పక్క ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని వ్యూహాలకు పార్టీలు పదును పెడుతున్నాయి. మూడో దశ ఎన్నికల కోసం యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ను టీఎంసీ కోసం పని చేస్తున్న పీకే టీం రూపొందించింది. సుందర్ బన్ పోరాట యోధురాలు టైటిల్ తో టీఎంసీ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఉంది. రాయల్ బెంగాల్ ఆడపులిగా మమతను అందులో చూపారు. అడవి బిడ్డలను దోచుకోవడానికి వచ్చిన అక్రమ దారులుగా బీజేపీ నేతలను దీదీ శిబిరం చిత్రీకరించింది. పంజా విసిరి అక్రమార్కులను ఆడపులి హతమార్చి, సుందర్ బన్ అడవులను కాపాడటంతో ఫిల్మ్ ముగుస్తోంది.