టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటి నుంచి ఆన్‌లైన్ మోసాలు చాలా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకు, నగదు లావాదేవీలు ఇంట్లో కూర్చొనే చేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రైమ్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొందరు మోసగాళ్లు బ్యాంకు ప్రతినిధులమంటూ కాల్స్ చేసి.. మెల్లిగా వినియోగదారుల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో మీరు వెంటనే కాల్ కట్ చేసి సైబర్ క్రైమ్‌కు సంప్రదించాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. దీంతో మోసగాళ్ల వివరాలు తెలుసుకుని మరొకరు వారి బారిన పడకుండా అప్రమత్తం చేయవచ్చని తెలిపారు.
బ్యాంకు ఖాతాదారులు యూపీఐ అకౌంట్లు క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ నంబర్ల, పాస్‌వర్డ్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఒక వేళ మీ యూపీఐ పాస్‌వర్డ్, పిన్ తెలిసినట్లు హ్యాకర్స్ ఈజీగా మీ డబ్బులను దొచుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేసి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ), పిన్, బ్యాంకు వివరాలు ఫార్వర్డ్ చేయమని అడిగినప్పుడు అస్సలు చేయకపోవడం మంచిది. ఎవరికీ కాల్ చేసి ఓటీపీ షేర్ చేయవద్దు. ఆన్‌లైన్ మోసాలు చేసేవారు మీ బ్యాంకింగ్ వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ఐడీ ద్వారా ఓటీపీ, పిన్ నంబర్లను తెలుసుకుని ఎంపిన్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీంతో మోసగాళ్లు సులభంగా డబ్బులు కాజేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానస్పదంగా ఎవరైనా కాల్ చేసిన.. మెసేజ్‌లు పంపించినా రెస్పాండ్ కాకుండా ఉండాలని, పొరపాటున వాటికి రెస్పాన్స్ ఇస్తే మీ ఫోన్ నంబర్‌తోపాటు బ్యాంకుల వివరాలు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత వివరాలు కూడా సేకరించే ప్రమాదం ఉంది.
అన్‌నౌన్ పర్సన్ నుంచి కాల్ వచ్చినప్పుడు వెంటనే మీరు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 155260 నంబర్‌కు కాల్ చేయాలి. మీరు కాల్ చేసినప్పుడు అధికారులు మోసగాళ్ల ఫోన్ నంబర్, ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. వీటిని బ్యాంకు, ఈ-కామర్స్ సంబంధిత పోర్టల్, డాష్ బోర్డుకు వివరాలు పంపించబడతాయి. బాధితుడు, మోసగాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని 3-4 గంటల్లో తెలుసుకోవచ్చు. కాబట్టి బాధితులు వీలైనంత తొందరగా ఫిర్యాదు చేయాలి. మీరు https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి ఫిర్యాదు కూడా చేయవచ్చు.