వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వీరిదే కీలక పాత్ర ఒక రకంగా ఆయన మానస పుత్రికగా ఈ వ్యవస్థను చెప్పుకోవాలి. నెలకు అయిదు వేల రూపాయల గౌరవ వేతనంతో వీరికి గ్రౌండ్ లెవల్లో విసృత అధికారాలు కల్పించారు. రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను ఏపీలో జగన్ సర్కార్ నియమించి పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడీ ఈ వ్యవస్థ పైనే వైసీపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వాలంటీర్లు ఇపుడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా ఉంటున్నారు. వారు ఎంత కీలకం అయ్యారు అంటే ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకంతో వారికి ఒక హోదా వచ్చింది. ఆ యాభై కుటుంబాలను పేరు పెట్టి పలకరించే స్థితి, సామాజికపరమైన గౌరవం కూడా దక్కాయి. ఇపుడు అదే వారికి ఒక రకంగా ప్లస్ పాయింట్ గా మారింది.
ఇక వాలంటీర్లు చాలా మంది స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచారు. దానికి కారణం వారికి స్థానికంగా ఉన్న పరపతే. ఇక ఎంత వాలంటీర్లు అయినా వారు కూడా మనుషులే వారికీ సొంత ఇష్టాలు ఉంటాయి. పైగా గతంలో వారు వేరే పార్టీకి అభిమానులుగా కూడా ఉండవచ్చు. ఉపాధి కోసం ఇటు చేరినా వారి మనసులో ఆ అభిమానం అలాగే ఉంటుంది. ఇపుడు అదే కొన్ని చోట్ల వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఇబ్బందిగా మారింది.
తమ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు వేరే ప్రత్యర్ధి పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు అన్న అక్కసు కూడా చాలా మంది వైసీపీ నేతల్లో ఉంది. మరో వైపు టీడీపీ లాంటి పార్టీలు వారిని వైసీపీ కార్యకర్తలు అని కూడా విమర్శించడమూ జరుగుతోంది. అప్పట్లో మంత్రులు ధర్మన కృష్ణదాస్,ఇతర మంత్రులు సైతం వాలంటీర్ల వ్యవస్త పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల వైసీపీ కేడర్ ఇబ్బందులకు గురవుతుందని పార్టీకోసం కష్టపడి పని చేసినవారికి అధికారంలోకోచ్చాక విలువ లేకుండా పోయిందన్న ఆవేదన వారిలో ఉందన్నారు.ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వాలంటీర్లలో పది శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేయడం మళ్లీ చర్చకు తెరలేపింది.
వారు ప్రభుత్వ పధకాలు అమలు చేయాలి. ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలి. కానీ రాజకీయాలు చేయడం ఏంటి అన్న మాట ఉంది. ఇపుడు దాన్నే పుష్ప శ్రీవాణి కూడా గట్టిగా నిలదీసారు.ఇపుడు అధికార పక్షం నుంచి వాలంటీర్ల మీద విమర్శలు వస్తే వాలంటీర్ల వ్యవస్థ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంది అంటున్నారు. జగన్ ఎంతో ప్రాతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు వైసీపీ నేతలకే నచ్చకపోవడం. వాలంటీర్లలో పార్టీల వారీ చీలికలు సీఎంజగన్ కి కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.