అప్పటి వరకు మ్యూచువల్ ఫండ్ల గురించి తెలియని వారు అందులో పెట్టుబడి పెట్టడానికి జంకుతారు. కారణం.. అది మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటుంది కాబట్టి. నిజమే, మార్కెట్లో రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. అలా అని మ్యూచువల్ ఫండ్లలో కేవలం రిస్క్ ఉన్న ఫండ్స్ మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే. ఈక్విటీ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దాని పోర్ట్ ఫోలియోలో మొత్తం ఈక్విటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ తప్పదు. అలాగే ఈక్విటీ ఫండ్లలో రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
ఇవి కాకుండా రిస్క్ తక్కువగా ఉండి రిటర్న్స్ తక్కువగా ఉన్న ఫర్లేదనుకుంటే కొన్ని ఫండ్లు మీకు మంచి అవకాశాన్ని ఇస్తాయి. అవే ఓవర్ నైట్ ఫండ్స్. నిజానికి ఇవి డెట్ ఫండ్సే. 2018లో ఈ కొత్త తరహా విభజనని సెబీ తీసుకువచ్చింది. ఓవర్ నైట్ ఫండ్స్ అంటే ఒకే రోజులో మెచ్యూర్ అవుతాయి. అంటె మీరు పెట్టిన పెట్టుబడి ఒకే రోజులో మెచ్యూర్ అవుతుందన్నమాట. ఈ ఓవర్ నైట్ ఫండ్లలో ఈ రోజు ఉన్న పోర్ట్ ఫోలియో రేపు ఉండదు. ఈ ఓవర్ నైట్ ఫండ్స్, డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీలు, ఓవర్ నైట్ రెపోస్ లలో పెట్టుబడి పెడతాయి.
కేవలం ఒక్కరోజులో మెచ్యూర్ అవుతాయి కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. కొత్తగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుని శాంపిల్ గా కొంత డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకునేవారికి ఈ ఓవర్ నైట్ ఫండ్స్ అనేవి మంచి అవకాశం. దీనిలో ముందుగా డబ్బులు పెట్టి, మ్యూచువల్ ఫండ్ల గురించి అవగాహన చేసుకోవడానికి బాగా పనికివస్తాయి. దీర్ఘకాలంలో లాభాలు పొందాలంటే తక్కువ రోజుల్లో లాభాలు అర్థం చేసుకోవాలి.
గమనిక: మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా చదవండి.