కరోనా కంటే కర్కశంగా కేసీఆర్ ప్రభుత్వం : విజయశాంతి ఫైర్

-

కేసీఆర్ సర్కారు తీరు కరోనా వైరస్ కంటే కర్కశంగా ఉందని విజయశాంతి ఫైర్ అయ్యారు. కరోనా బాధిత కుటుంబాలకు స్మైల్ స్కీం కింద కేంద్రం ఇచ్చే రూ.5లక్షల లోన్‌కు రాష్ట్ర సర్కారే అడ్డంకులు సృష్టిస్తోందని… బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని తెలంగాణ సర్కారు మొదట్లో పక్కన పడేసిందని ఆరోపణలు చేశారు. గడువు ముంచుకొస్తుండగా బీసీ సంక్షేమశాఖ అధికారులు హడావుడిగా అప్లికేషన్లు పెట్టించి రెండు రోజులకే బంద్ చేశారనీ.. ఎస్సీ, ఎస్టీ శాఖలైతే ఈ పథకంతో తమకు సంబంధమే లేదన్నట్టు వ్యవహరించాయని వెల్లడించారు. ఈ పథకాన్ని అమలు చేస్తే తెలంగాణలో సంభవించిన కరోనా మరణాల అసలు లెక్క బయటకొస్తుందని భయపడి రాష్ట్ర సర్కారు దీనికి గండికొట్టినట్టు కనిపిస్తోందని చురకలు అంటించారు.

బీజేపీకి పేరు వస్తుందన్న ఆందోళనతో… కేంద్రం నుంచి సరైన గైడ్ లైన్స్ లేవని చెబుతూ మొత్తానికి ముంచారని… జూన్ మొదటి వారంలోనే ఏడు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే… 6 రాష్ట్రాలకు సక్రమంగా ఉన్న గైడ్ లైన్స్ తెలంగాణకు మాత్రం సరిగ్గా లేవనడంలో అర్థమేంటి? అని ప్రశ్నించారు. కరోనా వల్ల ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలిచ్చి ఆదుకునేందుకు కేంద్రం స్మైల్‌‌ స్కీమ్‌‌ను ప్రకటించిందని… లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు రుణం‌ ఇచ్చేలా, ఇందులో రూ.లక్ష సబ్సిడీ ఇచ్చేలా రూపొందించిందని పేర్కొన్నారు. ఇంత మంచి పథకాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్న టీఆరెస్ సర్కారుకు జనం శాపనార్థాలు పెడుతున్నారని… ఇదేనా మీరు చెప్పే దళిత సాధికారత… బీసీ సాధికారతలు? అని విజయశాంతి నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news