న్యూఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కట్టి ఏపీకి అన్యాయం చేస్తోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని, కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని షెకావత్‌ను విజయసాయిరెడ్డి కోరారు.
అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, టీఆర్ఎస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ వాటానే వాడుతున్నామని ఆయన పేర్కొన్నారు.